ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఆయిల్ వచ్చింది.. వినియోగదారుడికి రూ.1.8 లక్షల నష్టపరిహారం..
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:40 PM
ఆన్‌లైన్‌లో ఐఫోన్-14 ప్రో కోసం ఆర్డర్ చేసి నూనె అందుకున్న వినియోగదారుడికి ఊరట లభించింది. ఈ కేసులో ముంబై వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది.
ఆన్‌లైన్‌లో ఐఫోన్-14 ప్రో కోసం ఆర్డర్ చేసి నూనె అందుకున్న వినియోగదారుడికి ఊరట లభించింది. ఈ కేసులో ముంబై వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఘటనలో ఈ-కామర్స్ వేదికతో పాటు విక్రేత కూడా బాధ్యత వహించాలని పేర్కొంటూ, వినియోగదారుడికి రూ.1.8 లక్షలకు పైగా పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది (iPhone 14 Pro beard oil delivery).
ముంబైలోని పవాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 2023 ఏప్రిల్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.1,11,793 విలువైన ఐఫోన్ 14 ప్రో (128 జీబీ)ని కొనుగోలు చేశాడు. పార్శిల్ తెరిచి చూడగా అందులో ఐఫోన్‌కు బదులుగా గడ్డం పెరుగుదలకు ఉపయోగించే నూనె, ప్యాకింగ్ సామగ్రి మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ వినియోగదారుడు షాకయ్యాడు. వెంటనే ఫ్లిప్‌కార్డ్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు (online shopping fraud).
వినియోగదారుడి ఫిర్యాదును పదే పదే 'పరిష్కరించాం' అంటూ కస్టమర్ కేర్ ప్రతినిధులు మూసివేయడం అన్యాయ వాణిజ్య పద్ధతి అని కమిషన్ అభిప్రాయపడింది. ఈ-కామర్స్ సంస్థ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని కమిషన్ పేర్కొంది. వినియోగదారుడికి రూ.1,11,793 కొనుగోలు మొత్తాన్ని వార్షిక 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అలాగే మానసిక వేదనకు రూ.50,000, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది.
ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌ను, విక్రేతను ముంబై కన్జ్యూమర్ కోర్టు ఆదేశించింది (Mumbai consumer forum). మొత్తం కలిపి వినియోగదారుడికి రూ.1.8 లక్షలకు పైగా అందనుంది. ఈ కేసులో భాగస్వామిగా ఉన్న ఆపిల్ ఇండియా, తాము ఉత్పత్తుల తయారీదారులం మాత్రమేనని, ప్యాకింగ్ లేదా డెలివరీ ప్రక్రియపై తమకు నియంత్రణ లేదని వాదించింది. ఈ వాదనను అంగీకరించిన కమిషన్, ఆపిల్ ఇండియాపై ఉన్న ఫిర్యాదును కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి..
ఇరాక్ ద్వారా అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. తిరస్కరించిన ఇరాన్..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..