Share News

ప్రతిపక్షాల చేతికి ‘ప్రధాన్‌’ అస్త్రం!

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:46 AM

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలకు బలం చేకూర్చినట్లయింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు...

ప్రతిపక్షాల చేతికి ‘ప్రధాన్‌’ అస్త్రం!

  • వివిధ అంశాలపై పార్లమెంట్‌ను స్తంభింపజేసేందుకు సమాయత్తం

న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలకు బలం చేకూర్చినట్లయింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ నీట్‌ పేపర్‌ లీక్‌పై ఉభయ సభలను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు... ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోగలిగాయి. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ఒక బిల్లు, వందేమాతరం పాడడాన్ని తప్పని సరిచేస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టడం మినహా ప్రభుత్వం ఎలాంటి ఎజెండాను అమలు చేయలేకపోయింది. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంతో ఇతర అంశాలపైనా కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ప్రశ్న పత్రాల లీక్‌లో బాధ్యులైన వారిని శిక్షించేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా రూపొందించిన బిల్లును కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం ఆమోదించింది. ఈ బిల్లుపై సోమవారం వాడీ వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల దాడిని దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. ఈ అంశంపై మోదీ, అమిత్‌షాలు శనివారం సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే, ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయనున్నాయి. విద్యార్థుల నిరసనలో పాల్గొనకుండా అడ్డుకున్నందుకు పలువురు ఎంపీలు సభా హక్కుల తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టనున్నాయి. జైలు పాలైన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ప్రతిపక్ష నేత ఒకరు చెప్పారు. కాగా, అయోధ్య రామమందిరంలో హుండీల చోరీ, ఈ-20 పెట్రోల్‌పై పార్లమెంట్‌ను స్తంభింపజేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:46 AM