Share News

ఓట్ చోరీపై కదం తొక్కిన విపక్షాలు!

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:02 AM

దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఓట్‌ చోరీ వ్యవహారంపై విపక్షాలు కదం తొక్కాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ, ఇండి కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనతో.. మంగళవారం ఢిల్లీ వీధుల్లో హైడ్రామా నడిచింది

ఓట్ చోరీపై కదం  తొక్కిన విపక్షాలు!
rahulgandhi

rahul2.jpg

  • ఇండి కూటమి ఆధ్వర్యంలో ఎంపీల భారీ ర్యాలీ

  • పార్లమెంట్‌ నుంచి ఈసీ కార్యాలయం

దిశగా 300 మంది ఎంపీల మార్చ్‌

  • సర్‌ రద్దు, సీఈసీ రాజీనామాకు డిమాండ్‌

  • మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

  • బ్యారికేడ్లెక్కి జాతీయజెండాతో నిరసన

  • పోలీసులకు చిక్కకుండా ‘ఆకాశవాణి’లోకి

రాహుల్‌.. అక్కడే రాత్రి వరకు నిరసన

  • ఆయన వెంట ప్రియాంక, కాంగ్రెస్‌ ఎంపీలు

  • 9 గంటల హైడ్రామా తర్వాత బలవంతంగా

అదుపులోకి.. అనంతరం విడుదల

  • జ్ఞానేశ్‌ సాయంతో మోదీ, అమిత్‌ షా,

మోహన్‌ భాగవత్‌ ఓట్ల చోరీ: రాహుల్‌

  • ఎంపీలను కలవడానికి అభ్యంతరమేంటని

ప్రశ్న ..

  • అపాయింట్‌మెంట్‌ కోరలేదన్న ఈసీ

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఓట్‌ చోరీ వ్యవహారంపై విపక్షాలు కదం తొక్కాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ, ఇండి కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనతో.. మంగళవారం ఢిల్లీ వీధుల్లో హైడ్రామా నడిచింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేతృత్వంలో 300 మందికి పైగా ఎంపీలు (లోక్‌సభ, రాజ్యసభ) చేపట్టిన మార్చ్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ కార్యక్రమానికి రాహుల్‌గాంధీ కేంద్ర బిందువుగా నిలిచారు. పార్లమెంట్‌ భవనం నుంచి ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇండి కూటమి ఎంపీల ర్యాలీ మొదలు కాగా, నీతి ఆయోగ్‌ కార్యాలయం సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ.. సేవ్‌ డెమోక్రసీ బ్యానర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ వినూత్న నిరసనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడున్న స్టీల్‌ బ్యారీకేడ్‌లపైకి ఎక్కి నిలబడి త్రివర్ణ పతాకం ఊపుతూ నిరసన తెలిపారు.


rahul3.jpg

విపక్ష ఎంపీలను బలవంతంగా అదుపులోకి తీసుకుని

తరలిస్తుండగా ఇండియా కూటమి ఎంపీలు, యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు బస్సులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట, తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్‌ గాంధీ, ప్రియాంక పోలీసుల వలయాన్ని దాటుకుని ఆల్‌ ఇండియా రేడియో (ఆకాశవాణి కార్యాలయం) భవన ప్రాంగణంలోకి దూసుకుపోయారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లనీయాలని పట్టుబట్టారు. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి చెట్టు కింద కూర్చున్నారు.

తమవెంట మొబైల్‌ టాయిలెట్లను సైతం తెచ్చుకున్నామని ప్రకటించారు. తమ నేతలు కూర్చునేందుకు, తినేందుకు చాపలు, తినుబండారాలను కార్యకర్తలు తెచ్చి ఇచ్చారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌, టీఎంసీ ఎంపీలు అభిషేక్‌ బెనర్జీ, డెరెక్‌ ఓబ్రెన్‌, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ సహా నిరసనకు దిగిన ఎంపీల్లో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి బస్సుల్లో తరలించారు. ఆ తర్వాత విడిచి పెట్టగా.. వారందరూ మధ్యాహ్నానికి తిరిగి నిరసనలో వచ్చి చేరారు. రాహుల్‌, ప్రియాంకతోపాటు కాంగ్రెస్‌ ఎంపీలు ఆకాశవాణి భవనాన్ని వీడలేదు. దీంతో చివరికి 9 గంటల తర్వాత పోలీసులు రాహుల్‌, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌ సహా ఇతర ఎంపీలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాత్రి 10 గంటల తర్వాత వారిని విడుదల చేశారు. ఈ నిరసన మార్చ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, టీఎంసీ నుంచి అభిషేక్‌ బెనర్జీ, ఎన్సీపీ (శరద్‌ పవార్‌) నుంచి సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) సంజయ్‌ రౌత్‌, ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా సహా ఇండియా కూటమి ప్రముఖ నేతలు హాజరయ్యారు. అయితే, ఈ నిరసనకు ఇండియా బ్లాక్‌లో భాగమైన ఆప్‌, డీఎంకే ఎంపీలు దూరంగా ఉండగా.. కూటమిలో లేని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఎంపీలు పాల్గొని మద్దతు పలికారు.


priyanka.jpg

మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటికే అనారోగ్యానికి గురికావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు రేణుకా చౌదరి, వేం నరేందర్‌ రెడ్డి, మల్లు రవి, రఘువీర్‌ రెడ్డి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, ఆర్‌.రఘురాం రెడ్డి, సురేష్‌ షెట్కార్‌, బలరాం నాయక్‌ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను ఆర్‌ఎస్ఎస్‌ యూనిఫామ్‌లో చూపించే కటౌట్లను ప్రతిపక్ష ఎంపీలు ప్రదర్శించారు. ఇండియా కూటమి మార్చ్‌ నేపథ్యంలో సెంట్రల్‌ ఢిల్లీని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యాలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లించారు

‘‘సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ సాయంతో ఓటు చోరీ ద్వారా ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఈ దేశాన్ని హైజాక్‌ చేశారు. ఇది ముమ్మాటికీ దేశద్రోహమే’’ అని రాహుల్‌ ధ్వజమెత్తారు. వీరెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని, భవిష్యత్తులో అందరిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ‘‘కోట్లాది మంది ప్రజలకు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము. ఎంపీలను ఎన్నికల కమిషనర్లను కలవనివ్వకపతే, ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంది’’అని రాహుల్‌ ప్రశ్నించారు. తర్వాత ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్టులో ‘జ్ఞానేశ్‌ ఇక చాలు. రాజీనామా చేయడానికి ఇదే సరైన సమయం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ఈ మార్చ్‌లో 300 మందికిపైగా విపక్ష ఎంపీలు పాల్గొన్నట్లు ప్రకటించారు. ‘‘జ్ఞానేశ్‌ కుమార్‌... మోదీ, షాల చేతిలో కేవలం కీలుబొమ్మ మాత్రమే.


rahul-and-priyanka.jpgఓట్ల దొంగతనంలో జ్ఞానేశ్‌ కుమార్‌కు పాఠాలు నేర్పింది ఆ పెద్ద దొంగలే’’ అంటూ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్షాల నిరసనపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. కష్టపడకుండానే రాహుల్‌ గాంధీని మరోసారి రాజకీయంగా పైకి తీసుకురావడానికి (రీలాంచ్‌ చేయడానికి) విఫలయత్నాలు చేస్తున్నాయని విమర్శించింది. ఎన్నికల్లో వరుస పరాజయాలపై తమ అసంతృప్తిని విపక్ష ఎంపీలు ఈ రూపంలో వ్యక్తం చేసున్నారని, రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

అపాయింట్‌మెంట్‌

అడగలేదు: ఈసీఐ

ఏ రాజకీయ పార్టీ కూడా అధికారికంగా తమ అపాయింట్‌మెంట్‌ కోరలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలతో భేటీల కోసం 2025లోనే ఈసీఐ ఒక స్పష్టమైన విధివిధానాన్ని (ప్రక్రియను) రూపొందించిందని గుర్తు చేసింది. దీని ప్రకారం.. ఏ పార్టీ లేదా కూటమి నేతలైనా సంఘాన్ని కలవాలంటే, తమ అధికారిక ప్రతినిధి ద్వారా ముందుగా సమయం కోరాలని.. ఇరువర్గాల అంగీకారంతో నిర్ణయించిన సమయంలో భేటీ జరగడం ఆనవాయితీ అని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక

రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన

Updated Date - Oct 07 , 2026 | 04:50 AM