Share News

ఓట్ల చోరీ’పై దేశవ్యాప్త ఉద్యమం

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:43 AM

దేశంలో ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ‘ఓట్ల చోరీ’ జరుగుతోందంటూ ఇండియా కూటమి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

ఓట్ల చోరీ’పై  దేశవ్యాప్త ఉద్యమం
opposition leaders

  • అక్టోబరు 2 నుంచి ఆరు దశల ఆందోళన

  • 6న సీఈసీ ఆఫీసుకు విపక్ష ఎంపీల మార్చ్‌.. నవంబరు 1న ఢిల్లీలో సభ

  • మోదీ, అమిత్‌ షా చేతిలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కీలుబొమ్మ

  • బ్యాలెట్‌ పేపర్లతోనే అన్ని ఎన్నికలు జరగాలి: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

  • ఢిల్లీలో ఇండీ కూటమి భేటీ.. సోనియా, మమత, ఒమర్‌ తదితరుల హాజరు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ‘ఓట్ల చోరీ’ జరుగుతోందంటూ ఇండియా కూటమి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ ఏకపక్ష, నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేసింది. బుధవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి 20 పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేతలుసోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్‌సీపీ(శరద్‌ పవార్‌) నేత సుప్రియా సూలే పాల్గొన్నారు. శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ ఆన్‌లైన్‌ ద్వారా (వర్చువల్‌గా) హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన సమావేశం అనంతరం వివరాలను ఖర్గే మీడియాకు వెల్లడించారు. ఎన్నికల, ప్రజాస్వామ్య వ్యవస్థల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని అన్ని పార్టీలు తీర్మానించినట్లు తెలిపారు. ఈవీఎంల మోసాలు, ఓట్ల తొలగింపు అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అక్టోబరు 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ‘సంవిధాన్‌ బచావో’ (రాజ్యాంగ పరిరక్షణ) పాదయాత్రలు, నిరసన ప్రదర్శనలు చేపడతామని స్పష్టం చేశారు.


అక్టోబరు 6న ప్రతిపక్ష ఎంపీలందరూ కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి భారీ ప్రదర్శనగా వెళ్లనున్నట్లు తెలిపారు. అక్టోబరు రెండో వారంలో రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరనున్నట్లు తెలిపారు. అక్టోబరు-నవంబరు మధ్యకాలంలో ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐదు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఖర్గే చెప్పారు. నవంబరు 1న ఢిల్లీలో భారీ సభ నిర్వహిస్తామని, మిగతా సభల తేదీలు, వేదికలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సుప్రీంకోర్టులో సర్‌, ఇతర ఎన్నికల అవకతవకలకు సంబంధించిన కేసులను త్వరగా విచారించి పరిష్కరించాలని కోరారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లతోనే అన్ని ఎన్నికలు జరగాలనేది ప్రతిపక్షాల ఏకాభిప్రాయమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ‘అక్రమ ఎన్నికల’ తర్వాత చేసిన చట్టాలన్నీ చట్టవిరుద్ధమైనవి కాబట్టి వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఆ చట్టాలను రద్దు చేస్తుందని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య మూలాలపై బీజేపీ ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తోందని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ‘ఈ దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారికి చట్టపరమైన కఠినశిక్ష పడేలా మా పోరాటం సాగుతుంద’ని హెచ్చరించారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం సంతోషకరమన్నారు. మోదీ, షాలు చేస్తున్న ఎన్నికల రిగ్గింగ్‌పై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువతలో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు వస్తాయన్నారు.


ఎన్నికలు బ్యాలెట్లతోనే

జరగాలి: మమతా బెనర్జీ

బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, మహారాష్ట్ర సహా గత సార్వత్రిక ఎన్నికల్లోనూ భారీగా ఓట్ల చోరీ జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఎన్నికలను రిగ్గింగ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, జేకేఎన్‌సీ, జేకేపీడీపీ, సీపీఐ-ఎంఎల్‌, ఐయూఎంఎల్‌, కేసీ-ఎం, ఎండీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్ పీ, కేసీ-జైత్ర, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి

రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక

డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ.

Updated Date - Oct 01 , 2026 | 04:47 AM