ఇక ప్రధాని క్షమాపణకు పట్టు!
ABN , Publish Date - Jul 27 , 2026 | 06:27 AM
కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా ప్రతిపక్షాల్లో కదనోత్సాహాన్ని పెంచింది. జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల దాడులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పేలా పార్లమెంటు...
విద్యార్థులపై పోలీసుల దాడి
వ్యవహారంలో పార్లమెంటులో
నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధం
నేడు ఖర్గే చాంబర్లో కూటమి భేటీ
నేడే లోక్‌సభలో పరీక్షల బిల్లు
న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా ప్రతిపక్షాల్లో కదనోత్సాహాన్ని పెంచింది. జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల దాడులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పేలా పార్లమెంటు వేదికగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాయి. మరోవైపు, ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడితే కఠిన శిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో చట్టసవరణ బిల్లు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఉదయం ఖర్గే చాంబర్‌లో సమావేశమై ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయనున్నారు. ఇంకోవైపు, విద్యార్థులపై పోలీసుల దాడి వ్యవహారాన్ని రాజ్యసభలో చర్చించాలని 267వ నిబంధన కింద టీఎంసీ నోటీసిచ్చింది. సోమవారం జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, ఇతర కార్యకలాపాలన్నీ సస్పెండ్ చేసి దీనిపై చర్చ జరపాలని ఆ పార్టీ ఎంపీ సాగరికా ఘోష్ అందులో కోరారు. ప్రధాన్ రాజీనామాతో నీట్ అంశం ముగియలేదని విపక్ష కూటమికి చెందిన ఓ సీనియర్ నేత అన్నారు.
బిల్లులపై ముందుకే..!
విపక్షాలు అడ్డంకులు సృష్టించినా పార్లమెంటు సమావేశాలనూ కొనసాగించాలని.. ఏ పరిస్థితుల్లోనైనా కీలక బిల్లులకు ఆమోదం పొందాలని కేంద్రప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పరీక్షల బిల్లుతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లుపై కూడా లోక్‌సభలో చర్చించి ఆమోదించనున్నారు. దీనిని ఇప్పటికే సభలో ప్రవేశపెట్టారు. పనిలోపనిగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు తేవడానికి కూడా రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
విద్యార్థులపై ఆటవిక దాడికి బాధ్యులెవరు?
పెల్లెట్ గన్స్ ప్రయోగానికి మీరు అనుమతించారా?
ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి
అమిత్‌షాకు రాహుల్‌గాంధీ లేఖ
ఢిల్లీలో ఈ నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఆటవిక దాడికి బాధ్యులెవరని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ రాశారు. ‘విద్యార్థులపై ప్రాణాంతకమైన పెల్లెట్ గన్స్ వాడడం దిగ్ర్భాంతి కలిగించింది. పేపర్ లీక్స్‌కు స్వస్తి చెప్పాలని..మన విద్యార్థులకు మంచి భవిష్యత్ కావాలని అడగడమే నేరమా? స్వతంత్ర భారతంలో మోదీ ప్రభుత్వ క్రౌర్యం ఇది. ఢిల్లీలో మోహరించిన భద్రతాదళాలు మీకే (అమిత్‌షాకు) రిపోర్టు చేయాలి. అందుచేత మిమ్మల్నే అడుగుతున్నాను. హోం మంత్రిగా పోలీసుల దాడికి, పెల్లెట్ గన్స్ వంటి ప్రాణాంతక ఆయుధాల ప్రయోగానికి మీరే అనుమతించారా? కాదంటే మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? విద్యార్థులను కొట్టిన వ్యక్తులు మఫ్టీలో ఉన్న పోలీసులా.. లేక వలంటీర్లా? భారీగా బలగాల మోహరింపును ఎవరు అనుమతించారు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలని దేశం డిమాండ్ చేస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు