ప్రభుత్వ చెప్పుచేతల్లో సీఈసీ!
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:16 AM
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ అభిశంసనకు ప్రతిపక్ష ఎంపీలిచ్చిన నోటీసుల్లో పలు ఆరోపణలు చేశారు. ఆయన ప్రభుత్వ చెప్పుచేతల్లో...
అభిశంసన తీర్మానంలో ప్రతిపక్షాల ధ్వజం
న్యూఢిల్లీ, మార్చి 22: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ అభిశంసనకు ప్రతిపక్ష ఎంపీలిచ్చిన నోటీసుల్లో పలు ఆరోపణలు చేశారు. ఆయన ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(సర్) చేపట్టి సామూహికంగా లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించారని విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కర్ణాటకలోని మహదేవ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తే ఆయన్ను వివక్షపూరితంగా టార్గెట్ చేశారని తెలిపారు. ఓట్ల అవకతవకలపై దర్యాప్తునకు నిరాకరించడమే గాక.. గత ఏడాది ఆగస్టు 17న విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. రాహుల్ క్షమాపణ చెప్పాలని.. లేదంటే ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారని ఆక్షేపించారు. జ్ఞానేశ్‌కుమార్ దుష్ప్రవర్తన నిరూపితమైందన్నారు. కమిషన్ స్వతంత్రత, రాజ్యాంగ విశ్వసనీయత పరిరక్షణలో ఆయన విఫలమయ్యారని తెలిపారు. ‘సుదీర్ఘ కాలం పట్లే ‘సర్’ ప్రక్రియను ఎన్నికలు జరిగే పెద్ద రాష్ట్రాల్లో రాకెట్ వేగంతో పూర్తిచేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో బిహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బెంగాల్లో 56 లక్షల ఓట్లు తీసేశారు. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట మరో 60 లక్షల ఓట్లను పరిశీలన పేరిట సందిగ్ధంలో పడేశారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల రిజస్టర్ (ఎన్‌ఆర్‌సీ)ని అమలు చేస్తామన్న కేంద్ర హోం మంత్రి వైఖరికి సంపూర్ణ అనుకూలంగా ఉంది. జ్ఞానేశ్‌కుమార్ తటస్థ ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వ రాజకీయ ఎజెండా సాధనంగా మార్చేశారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ సంస్థను పౌరసత్వ నిర్ధారణ ట్రైబ్యునల్‌గా మార్చారు’ అని దుయ్యబట్టారు. సీఈసీ నియామక ప్రక్రియను కూడా ఎంపీలు ప్రస్తావించారు. ఆయన నియామకంపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉందన్నారు.
విపక్షాలకు చెందిన 130 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన ఈ నోటీసులను ఈ నెల 12న ఉభయసభలకు సమర్పించిన సంగతి తెలిసిందే. అభిశంసన తీర్మానాన్ని ఉభయసభలూ ఆమోదిస్తే.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కలిసి.. భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 25 రాష్ట్రాల హైకోర్టుల్లోని ఏదో ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్, ప్రముఖ న్యాయకోవిదుడితో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేస్తారు. విచారణలో సాక్షులను, నిందితులను క్రాస్‌ఎగ్జామిన్ చేస్తారు. సీఈసీ కూడా కమిటీ ముందు హాజరై తన వైఖరి చెప్పుకొనే అవకాశం ఉంటుంది. ఈ కమిటీ నివేదికను ఉభయసభల ముందు ఉంచి అభిశంసనపై చర్చ ప్రారంభిస్తారు. సభల్లో చర్చించేటప్పుడు జ్ఞానేశ్‌కుమార్‌కు తన వాదన వినిపించే హక్కు ఉంటుంది. అయితే సభ ప్రవేశ ద్వారం వద్ద ఆయన నిల్చోవాలి. ఆయన్ను తొలగించాలంటే రెండు సభలూ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప