Share News

దారుణ పరిస్థితులకు సిద్ధం కండి

ABN , Publish Date - May 13 , 2026 | 05:35 AM

అమెరికా-ఇరాన్‌ యుద్ధం రెండున్నర నెలలు దాటినా కొలిక్కిరాని నేపథ్యంలో భారత్‌ రాబోయే రోజుల్లో దారుణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కోటక్‌ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు...

దారుణ పరిస్థితులకు సిద్ధం కండి

చమురు దెబ్బ ఇక నుంచే పడనుంది

  • కంపెనీలు, కుటుంబాలకు షాక్‌ తప్పదు

  • ఆదాయానికి మించి ఖర్చు పెట్టొద్దు

  • దేశ ప్రజలకు ఉదయ్‌ కోటక్‌ సూచన

న్యూఢిల్లీ, మే 12: అమెరికా-ఇరాన్‌ యుద్ధం రెండున్నర నెలలు దాటినా కొలిక్కిరాని నేపథ్యంలో భారత్‌ రాబోయే రోజుల్లో దారుణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కోటక్‌ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన సీఐఐ సమావేశంలో మాట్లాడారు. పరిమిత ఆదాయంతో బతికే వినియోగదారులు, చిన్నవ్యాపారులకు యుద్ధం దెబ్బ గట్టిగా తగలడం ఇకనుంచే మొదలు కానుందని అన్నారు. కంపెనీలు, కుటుంబాలు ఇప్పటి నుంచే రాబోయే దెబ్బను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. భారత్‌ దగ్గర భారీ ఎత్తున చమురు నిల్వలు గతంలో చౌకగా కొన్నవి ఉండటం వల్ల ఇప్పటిదాకా మనకు సాధారణంగా గడచి పోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా కొనే చమురు ధరలు భారీగా ఉన్నందున ఆ భారం ప్రజలపై వేయక తప్పదని, అది గట్టిగానే ఉంటుందని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు నేరుగా వాడని వారికి కూడా నిత్యావసరాల రూపంలో గల్ఫ్‌ దెబ్బ పడుతుందని అన్నారు. వేతనాలు పెరిగే అవకాశం లేని కుటుంబాలకు ఇది పెద్ద షాక్‌ కానుందని చెప్పారు. చమురు అవసరాలకు 85ు దిగుమతులపై ఆధారపడుతున్న భారతదేశానికి ఏ మాత్రం ముడి చమురు ధరలు పెరిగినా ద్రవ్యోల్బణం పెరిగిపోయి రూపాయి పతనం అవుతుందన్నారు. దేశ ఆర్థిక స్థిరత్వమే ప్రమాదంలో పడుతుందని చెప్పారు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 60 డాలర్ల దగ్గర ఉన్నపుడే భారత్‌ కరెంటు ఖాతా లోటును మేనేజ్‌ చేయగలదని, వంద డాలర్లు దాటిందంటే ఒత్తిడి అధికం అవుతుందని వివరించారు. వ్యక్తులైనా, ప్రభుత్వాలైనా కష్టకాలంలో ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం మానేయాలన్నారు. భారత్‌ విదేశీ పెట్టుబడులపై పెద్దగా ఆధారపడొద్దని ఉదయ్‌ కోటక్‌ సూచించారు. ఆర్థిక స్వయంస్వావలంబన కోసం దేశీయ రిస్క్‌ క్యాపిటల్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రపంచం ముక్కలుగా చీలిపోయిందని, ప్రతీ దేశం సొంత ప్రయోజనాల మీద అత్యంత శ్రద్ధ చూపిస్తున్నాయని చెప్పారు.


మాంద్యంలోకి కొన్ని ఆర్థిక వ్యవస్థలు: సింగపూర్‌ ప్రధాని

హోర్మూజ్‌ సంక్షోభం ఇప్పట్లో తెమిలేట్ల్లు లేదని, దీని కారణంగా కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోతాయని సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ అంచనా వేశారు. దాని ప్రభావాన్ని సింగపూర్‌ కూడా అనుభవిస్తోందన్నారు. ఇంధనమే కాకుండా ఆహారం, ఎరువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని చెప్పారు.

చెల్లింపుల అగ్నిపరీక్ష

అమెరికా-ఇరాన్‌ యుద్ధం కేవలం విదేశాంగ శాఖ సమస్య కాదని, భారత్‌ చెల్లింపుల సామర్థ్యానికి అగ్నిపరీక్ష అని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అనంతనాగేశ్వరన్‌ అన్నారు. భారత్‌ తన చమురు అవసరాల్లో 87 శాతం దిగుమతి చేసుకుంటోందని, అందులో 46 శాతం హోర్మూజ్‌ నుంచే రావాల్సి ఉందని వివరించారు. భారత్‌ ఎల్‌పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటున్నామని, అందులో 90 శాతం హోర్మూజ్‌ నుంచే వస్తుందని వెల్లడించారు. ఽప్రవాస భారతీయులు పంపించే డబ్బులో 38 శాతం గల్ఫ్‌ నుంచే వస్తుందని గుర్తు చేశారు. అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో ఇవన్నీ సంక్షోభంలో పడ్డాయని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 05:35 AM