ఒడిశాలో దారుణం.. యువతి బట్టలు చింపేసి దాడి..
ABN , Publish Date - Jun 20 , 2026 | 08:43 PM
ఇద్దరు ఎన్జీవో కార్యకర్తలను కిడ్నాపర్లుగా భావించి దాడి చేసిన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రాంతానికి వెళ్లాల్సిన బాధితులు పొరపాటున మరో గ్రామానికి వెళ్లారు. అక్కడ చిన్నారులతో ఆపాయ్యంగా మాట్లాడి వారికి బిస్కెట్లు ఇవ్వడంతో కిడ్నాపర్లనే పుకారు షికారు చేసింది.
ఒడిశా: ఇద్దరు ఎన్జీవో కార్యకర్తలను కిడ్నాపర్లుగా భావించి దాడి చేసిన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రాంతానికి వెళ్లాల్సిన బాధితులు పొరపాటున మరో గ్రామానికి వెళ్లారు. అక్కడ చిన్నారులతో ఆపాయ్యంగా మాట్లాడి వారికి బిస్కెట్లు ఇవ్వడంతో కిడ్నాపర్లనే పుకారు షికారు చేసింది. నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న ఓ గుంపు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. యువతిని వివస్త్రను చేసి అనాగరికంగా ప్రవర్తించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కంధమాల్ జిల్లాలో ఇద్దరు యువతీయువకులు ఓ ఎన్జీవోలో పని చేస్తున్నారు. జూన్ 16వ తేదీన సామాజిక కార్యక్రమంలో భాగంగా వారిద్దరూ కలహండిలోని తువాముల్ రాంపూర్‌కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అయితే, వారికి ఆ ప్రాంతం గురించి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ వాడారు. మారుమూల ప్రాంతం కావడంతో వెళ్లాల్సిన చోటకు కాకుండా పొరపాటున రాయగడ జిల్లాలోకి ప్రవేశించారు. కల్యాణ్ సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ధమునిపంగ పంచాయతీ కందుల్‌గూడ గ్రామానికి చేరుకున్నారు.
దారి తప్పామని గుర్తించిన యువతీయువకులు గమ్యస్థానానికి వెళ్లేందుకు గ్రామస్థులను సమాచారం అగడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వాహనాన్ని ఆపి దారి గురించిన సమాచారాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించి బిస్కెట్లు ఇచ్చారు. ఇదే వారు చేసిన అతి పెద్ద తప్పుగా మారింది. పిల్లలను కిడ్నాప్ చేసే వాళ్లు గ్రామానికి వచ్చారనే పుకారు నిమిషాల్లోనే కందుల్ గూడలో ప్రచారం జరిగింది. వెంటనే ఎన్జీవో కార్యకర్తల వద్దకు కొంతమంది గ్రామస్థులు చేరుకున్నారు. ద్విచక్రవాహనం తాళం లాక్కొన్ని గుర్తింపు పత్రాలు చూపించాలని డిమాండ్ చేశారు.
వాటిని చూపించినా సరే మూకుమ్మడిగా వారిపై దాడికి పాల్పడ్డారు. చేతులు, కాళ్లతో విపరీతంగా కొట్టారు. కొంతమంది కర్రలు తీసుకుని కాళ్లు, చేతులు, ముఖంపై దాడి చేశారు. బట్టలు మెుత్తం చింపేసి యువతిని వివస్త్రను చేశారు. ఈ దాడిలో యువతీయువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. మరోవైపు పలువురు గ్రామస్థులు ఈ ఘటనను తమ మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించారు. అక్కడికి చేరుకున్న మరికొంతమంది గ్రామస్థులు ఆ ఇద్దరు ఎన్జీవో కార్యకర్తలను రక్షించి పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఇద్దరు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అనంతరం వారిని రాయగడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేసినట్లు రాయగడ ఎస్పీ రాజ్ ప్రసాద్ తెలిపారు. మరోవైపు దాడికి పాల్పడిన 21 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్పీ రాజ్ ప్రసాద్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్రం కీలక నిర్ణయం.. 16 డ్రగ్ కాంబినేషన్లపై నిషేధం..
ఇదెక్కడి పవర్.. కాలితో బైక్ నడిపి షాకిచ్చిన బాబా..