సోదరి చావుకి ఆధారం కోరిన బ్యాంకు అధికారులు.. దీంతో అక్క అస్థిపంజరంతో..
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:27 AM
ఒడిశాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తన సోదరి చనిపోయిందనే విషయం నిరూపించేందుకు ఓ గిరిజనుడు ఏకంగా ఆమె సమాధిని తవ్వి అస్తిపంజరాన్ని బ్యాంక్‌కు మోసుకెళ్లాడు..
సోదరి చావుకి ఆధారం కోరిన బ్యాంకు అధికారులు
సమాధి తవ్వి అస్తిపంజరం మోసుకొచ్చిన సోదరుడు
ఆమె ఖాతా నుంచి రూ.19,300 విత్‌డ్రాకు వేడుకోలు
భువనేశ్వర్, ఏప్రిల్ 28: ఒడిశాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తన సోదరి చనిపోయిందనే విషయం నిరూపించేందుకు ఓ గిరిజనుడు ఏకంగా ఆమె సమాధిని తవ్వి అస్తిపంజరాన్ని బ్యాంకుకి తీసుకెళ్లాడు. కియోంఝర్‌లోని దియానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50) సోదరి కాల్రా ముండా (56)కి మల్లిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. పశువులు అమ్మగా వచ్చిన సొమ్మును ఆమె అందులో జమ చేసింది. అయితే అనారోగ్యం కారణంగా కాల్రా.. రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక కుమారుడు గతంలోనే చనిపోయారు. దీంతో ఆమె చనిపోయే ముందు తన బ్యాంకులో ఉన్న రూ.19,300 నువ్వే తీసుకో అంటూ తన సోదరుడు జీతూకి చెప్పింది. ఈ క్రమంలో తన అక్క ఖాతాలో ఉన్న డబ్బులు విత్‌డ్రా చేసేందుకు జీతూ కొన్నిరోజుల క్రితం బ్యాంకుకి వెళ్లాడు. అయితే డబ్బులు తీయాలంటే ఖాతాదారు తప్పనిసరిగా హాజరు కావాలని, లేదంటే మరణ ధ్రువీకరణ పత్రం గానీ, తామే వారసులమని నిరూపించే పత్రాలు గానీ సమర్పించాలని బ్యాంకు అధికారులు చెప్పారు. నిరక్షరాస్యుడైన జీతూ.. బ్యాంకుకి వెళ్లిన ప్రతిసారీ తనవద్ద అలాంటి పత్రాలేమీ లేవని, ఎలాగోలా డబ్బులు ఇప్పించాలని ప్రాధేయపడేవాడు.
విసుగుచెందిన బ్యాంకు అధికారులు కాల్రా ముండా చనిపోయినట్టు ఆధారం కావాలి కదా.. అది నిరూపిస్తేనే డబ్బులిస్తామని చెప్పారు. దీంతో జీతూ శ్మశానవాటికకు వెళ్లి.. తన అక్క సమాధిని తవ్వి అస్తిపంజరాన్ని బయటకు తీశాడు. దాన్ని భుజాన వేసుకుని మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ బ్యాంకుకి తీసుకెళ్లాడు. ఇదిగో మా అక్క అస్తిపంజరం.. ఇప్పుడైనా ఆమె చనిపోయినట్టు నమ్ముతారా అని అన్నాడు. దీంతో బ్యాంకు అధికారులు విస్తుపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు బ్యాంకుకి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో అస్తిపంజరాన్ని తిరిగి శ్మశానవాటికలో ఖననం చేశారు. ఈ ఘటనపై కియోంఝర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. కాల్రా ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం జీతూకి చెల్లించినట్టు చెప్పారు. ‘స్థానిక తహసీల్దార్, బ్యాంకు అధికారులతో మాట్లాడి.. కాల్రా ఖాతాలో జమచేసిన రూ.19,300కు వడ్డీతో కలిపి రూ.19,402 మంగళవారం జీతూకు అందజేశారు’ అని వెల్లడించారు. కాగా, జీతూ ముండాకి జిల్లా యంత్రాంగం కూడా రెడ్‌క్రాస్ నిధి నుంచి రూ.30,000 అందజేసింది.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..