ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:43 PM
నీట్ యూజీ -2026 పేపర్ లీక్, యూజీసీ నెట్ పరీక్షలో లోపాలు.. పరీక్షల రద్దు.. ఇలా వరుస పరిణామాలతో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ మార్పులకు..
న్యూఢిల్లీ: నీట్ యూజీ -2026 పేపర్ లీక్, యూజీసీ నెట్ పరీక్షలో లోపాలు.. పరీక్షల రద్దు.. ఇలా వరుస పరిణామాలతో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే దాదాపు 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీరి స్థానంలో 10 కొత్త వృత్తిపరమైన పోస్టులు ఏర్పాటు చేసి, నియామకాలు చేపట్టాలని ఎన్‌టీఏ భావిస్తోందని సమాచారం.
ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దీప్తి గౌర్ ముఖర్జీ, ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్‌టీఏ తమ సమగ్ర పరీక్షా విధానాన్ని సంస్కరించడానికి తీసుకున్న చర్యల గురించి కేంద్రమంత్రికి వివరించారు.
50 మందికి పైగా NTA సిబ్బందిని తొలగించి.. 10 కొత్త వృత్తిపరమైన కీలక పోస్టులకు ప్రకటనలు జారీ చేసి, నియామకాలు చేపడుతున్నట్లు కేంద్రమంత్రికి అధికారులు తెలిపారు. వీటిలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, టెస్ట్ సెక్యూరిటీ జనరల్ మేనేజర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ సైకోమెట్రిక్స్ జనరల్ మేనేజర్ వంటి పోస్టులు ఉండనున్నాయి. సైబర్-సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్ర రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం NTA ప్రైవేట్ రంగం నుండి డొమైన్ నిపుణులను కూడా తీసుకోనున్నట్లు సమాచారం.
పరీక్ష భద్రతలో సమగ్ర ప్రక్షాళన..
నిర్ధారిత పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని, కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్స్ (CONOPS) నిర్మాణాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని ఎన్‌టీఏను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, తీసుకున్న దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించాలని ఎన్‌టిఎను కోరారు. పరీక్షల నిర్వహణలోని వివిధ దశలలో వ్యవస్థలను బలోపేతం చేయడం, లోపాలను మూలంలోనే నివారించడం లక్ష్యంగా పని చేయాలని అధికారులకు కేంద్రమంత్రి దిశానిర్దేశం చేశారు.
యూజీసీ-నెట్ పునఃపరీక్షతో కొత్త సమస్య..
ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులలో తప్పులు దొర్లాయంటూ పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వెంటనే ఎన్‌టీఏ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. మూడు పేపర్లలో అనేక వాస్తవిక, ముద్రణ దోషాలు, అనువాద లోపాలను కనుగొంది. వీటిలో ప్రముఖ పండితుల పేర్లను తప్పుగా రాయడం, అస్పష్టంగా ఉన్న పుస్తకాల శీర్షికలు, ప్రశ్నల పదజాలంలో తప్పులు, వ్యాకరణ, విరామ చిహ్నాల పొరపాట్లు, ప్రామాణికం కాని పదాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అలాగే, గత పరీక్షల నుండి గణనీయమైన సంఖ్యలో ప్రశ్నలు పునరావృతమైనట్లు కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే నిష్పక్షపాతమైన, దోషరహితమైన పరీక్ష కోసం మూడు పేపర్ల పరీక్షలను తిరిగి నిర్వహించాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫారసుతో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్ల పరీక్షలు తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.
మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు..
ఇంగ్లీష్, కామర్స్ పేపర్లు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పేపర్ సెప్టెంబర్ 10 తేదీన రీఎగ్జామ్ నిర్వహించబడతాయని ఎన్‌టీఏ ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు అదనపు పరీక్షా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.