Share News

వాలెంటైన్ డే రోజు దారుణం.. కారులో ప్రియురాలిపై..

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:28 PM

వాలెంటైన్స్ డే రోజున ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపేశాడు. అనంతరం అదే తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు..

వాలెంటైన్ డే రోజు దారుణం.. కారులో ప్రియురాలిపై..
Noida couple

నోయిడా, ఫిబ్రవరి 15: వాలెంటైన్స్ డే రోజున ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపేశాడు. అనంతరం అదే తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని త్రిలోక్‌పురికి చెందిన 32 ఏళ్ల సుమిత్, నోయిడాలోని సెక్టార్ 58కు చెందిన 26 ఏళ్ల రేఖ.. కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన ఇద్దరూ కనిపించకుండా పోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వారి కోసం వెతకటం మొదలెట్టారు.


ఫిబ్రవరి 14వ తేదీన ఇద్దరూ ఓ కారులో శవాలుగా కనిపించారు. ఇద్దరూ బుల్లెట్ గాయాల కారణంగా మరణించినట్లు పోలీసులు గుర్తించారు. సుమిత్ చేతిలో తుపాకి ఉండటంతో .. అతడు రేఖను కాల్చి చంపి, తర్వాత తనూ కాల్చుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సుమిత్ వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ను పోలీసులు కనుగొన్నారు. ఆ మెసేజ్‌లో ఏముందంటే.. ‘రేఖ, నేను 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నన్ను పెళ్లి చేసుకుంటానని రేఖ చెప్పింది. కానీ, ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. రేఖ మోసం చేసినందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాసుకొచ్చాడు.


పోలీసులు మర్డర్, సూసైడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుమిత్ తల్లిదండ్రులు తమ కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేఖ కుటుంబసభ్యులే సుమిత్, రేఖలను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి కులాలు వేరు కావటం వల్ల రేఖ కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదని, చాలా సార్లు తమను బెదిరించారని అంటున్నారు. పోలీసులు అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

షాకింగ్.. పాములు ఇలా కూడా చేస్తాయా.. ఓ పాము తనను తానే ఎలా మింగేస్తోందో చూడండి..

పైలెట్, కో-పైలెట్‌కు ఒకే ఆహారాన్ని ఎందుకివ్వరు.. ఆసక్తికర కారణం తెలిస్తే..

Updated Date - Feb 15 , 2026 | 05:01 PM