ఏ రాష్ట్రానికీసీట్ల శాతం తగ్గదు!
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:24 AM
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను హెచ్చరించారు.
కోటాను వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదు.. మీరే నష్టపోతారు.. విపక్షాలకు ప్రధాని హెచ్చరిక
చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాలు 50 శాతం పెంపు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయ్
తమిళనాడు 39-59, కర్ణాటక 28-42, కేరళ 20-30
అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్లు పెంచుతున్నాం
దక్షిణాది రాష్ట్రాలకు 50 శాతం మించి పెరుగుతాయి
తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు తలా 0.05 శాతం అదనం
లోక్‌సభకు వివరించిన హోంమంత్రి అమిత్‌షా
12 గంటల చర్చ.. నేటి సాయంత్రం 4 గంటలకు ఓటింగ్
బిల్లు ప్రవేశపెట్టినప్పుడూ ఓటింగ్‌కు పట్టుబట్టిన విపక్షం
104 మంది గైర్హాజరు.. తేలిగ్గా నెగ్గిన సర్కారు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను హెచ్చరించారు. లోక్‌సభ సీట్లను పెంచడం వల్ల రాష్ట్రాలకు ప్రస్తుతం లభించే సీట్ల శాతంలో ఎలాంటి మార్పూ ఉండదని ప్రధాని హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకూ లోక్‌సభలో 50 శాతం సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు గతంలో కంటే ఎక్కువ శాతం సీట్లు లభిస్తాయని కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు 25 నుంచి 38కి, తెలంగాణకు 17 నుంచి 26కు పెరుగుతున్నాయని సభాముఖంగా వెల్లడించారు. లోక్‌సభలో గురువారం చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లులపై ప్రతిపక్షాల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు ప్రయత్నించారు. దాదాపు 12 గంటల పాటు ఈ బిల్లులపై చర్చ జరిగిన తర్వాత శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కీలకమైన ఓటింగ్ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. గురువారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత మోదీ, అమిత్‌షాలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్, డీఎంకే నేత ఎ.రాజా, తెలుగుదేశం ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన(యూబీటీ) నేత, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగించారు.
మహిళలు గమనిస్తున్నారు
మహిళా బిల్లును తిప్పిగొట్టేందుకు ప్రతిపక్షాలు దురుద్దేశ పూరితంగా వ్యవహరిస్తే మహిళలు గమనిస్తున్నారన్న విషయం మరిచిపోరాదని ప్రధాని మోదీ హెచ్చరించారు. డీలిమిటేషన్‌ను ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఉపయోగించుకోవడం సరైనది కాదని అన్నారు. లోక్‌సభలో సీట్ల పెంపు తర్వాత అన్ని రాష్ట్రాలకు లభించే సీట్ల శాతంలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ను ఇంకెంత మాత్రం జాప్యం చేయకూడదని, ఇప్పటికే వారికి చాలా అన్యాయం జరిగిందని చెప్పారు. సాంకేతిక కారణాలు, ఏవో నెపాలు చూపిస్తూ మహిళలను మోసం చేయరాదని విజ్ఞప్తి చేశారు. బిల్లు ఆమోదం పొందితే ఘనత దక్కించుకోవాలని తాను భావించడంలేదని, ఆమోదం పొందకపోతేనే తనకు ప్రయోజనకరమని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ను అందరూ ఆమోదిస్తే వార్తా పత్రికల్లో అందరి ఫోటోలు తన ఖర్చుతో వేయిస్తానని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఎవరి పట్లా అన్యాయం కానీ వివక్ష కాని జరగదని హామీ ఇచ్చారు. ఉద్దేశం మంచిదైనప్పుడు పదాలతో ఆడుకోకూడదని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. మహిళా కోటాలో ఓబీసీలకు వాటా డిమాండ్‌పై ప్రధాని మోదీ స్సందిస్తూ, తాను కూడా ఓబీసీనేనని, రాజ్యాంగ ప్రకారం అందరికీ న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. లోక్‌సభ సీట్ల పెంపు, మహిళలకు రిజర్వేషన్ గురించి తాము ముందుగానే ఆలోచించామని, అందుకే అందరికీ చోటు కల్పిచేందుకు కొత్త పార్లమెంట్‌ను విశాలంగా నిర్మించామని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకే లాభం
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దక్షిణాదిలో ఉన్న జనాభా కంటే ఎక్కువ సీట్లు లభిస్తాయని, ఎక్కడ అన్యాయం జరుగుతుందో చె ప్పాలని నిలదీశారు. తాము అన్ని రాష్ట్రాలకు దాదాపు 50 శాతం మేరకు సీట్లు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్‌సభలో 129 మంది సభ్యులున్నారని, వారి సంఖ్య 195 సీట్లకు పెరుగుతుందని వివరించారు. లోక్‌సభలో దక్షిణాది ప్రాతినిధ్యం 23.76 శాతం నుంచి 23.97 శాతానికి(0.21 శాతం) పెరుగుతుందన్నారు. డీలిమిటేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణ లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు, కర్ణాటక సీట్లు 28 నుంచి 42కు, తమిళనాడు సీట్లు 39 నుంచి 59కి, కేరళ సీట్లు 20 నుంచి 30కి పెరుగుతాయని వివరించారు. ఏపీకి 4.6 శాతం నుంచి 4.65 శాతానికి(0.05 శాతం అదనం), తెలంగాణకు 3.13 శాతం నుంచి 3.18 శాతానికి(0.05 శాతం అదనం) తమిళనాడుకు 7.18 శాతం నుంచి 7.23 శాతానికి(0.05 శాతం అదనం) వాటా పెరుగుందని వివరించారు. కర్ణాటకకు 5.15 శాతం నుంచి 5.14 శాతానికి (0.01 శాతం తక్కువ) కేరళకు 3.68 శాతం నుంచి 3.67 శాతానికి(0.01 శాతం తక్కువ) వాటా అత్యంత స్వల్పంగా తగ్గుతుందని హోంమంత్రి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76 శాతం నుంచి 19 శాతానికి తగ్గుతుందని విపక్షాలు ప్రచారం చేశాయని, తాము 24 శాతానికి పెంచుతున్నామని చెప్పారు. తాము కులగణనను వ్యతిరేకిస్తున్నామన్నది సరైంది కాదని, జనగణనలో భాగంగా కులగణన కూడా చేస్తామని ప్రకటించారు. ఏ ప్రాంతానికీ సీట్ల విషయంలో నష్టం జరగదని చెప్పారు. కావాలంటే కేజీ పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ప్రాతిపదిక ఏమిటి?: వేణుగోపాల్
850 సీట్లు ఏ ప్రాతిపదికన పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. 50 శాతం పెంచాలన్నది బిల్లులో ఎక్కడుందని నిలదీశారు. 2029 ఎన్నికల్లో గెలిచేందుకే డీలిమిటేషన్‌ను ఒక వ్యూహంగా తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము సలహాలిస్తామన్నారు. బిల్లును ఏకాభిప్రాయ సాధన ద్వారా ఆమోదించాలని సూచించారు. తొమ్మిదేళ్లుగా బిల్లును ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడేదో ఆలస్యం జరుగుతోందని ప్రధాని ఎందుకు వాపోతున్నారని అడిగారు. మహిళా రిజర్వేషన్‌ను ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు వ్యూహంగా వాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్‌కు అనుకూలమేనని కేసీ వేణుగోపాల్ అన్నారు. దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతిని, మొదటి మహిళా ప్రధానిని, మెదటి మహిళా స్పీకర్‌ను కాంగ్రెసే అందించిందని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ ఎన్నోసార్లు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖలు రాశారని ప్రస్తావించారు. ఎన్నికలయ్యే వరకు ఆగి ఈ సమావేశం ఏర్పాటు చేస్తే కొంపలు మునిగేదేముందని ప్రశ్నించారు. ఒక్క పది రోజులు ఆగలేక పోయారా? అన్నారు. తమిళనాడు, బెంగాల్ ఎంపీలు లేకుండా బిల్లులు ఆమోదించాలనే ప్రయత్నం జరుగుతోందని, ప్రతిపక్షాలను మహిళల వ్యతిరేకులుగా చిత్రించాలనుకుంటున్నారని విమర్శించారు. గతంలో డీలిమిటేషన్ జరిగినపుడల్లా ఏకాభిప్రాయ సాధన ద్వారా జరిగిందని గుర్తు చేశారు. బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదించడం కుదరదని అన్నారు.