ఊర్లో నెట్‌వర్క్ సరిగా లేదని మనస్తాపానికి గురైన యువకుడు..
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:15 AM
గత నెల రోజులుగా ఊరిలో మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేదని ఓ యువకుడు మనస్తాపానికి గురయ్యాడు. ఆ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: గత నెల రోజులుగా ఊరిలో మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేదని ఓ యువకుడు మనస్తాపానికి గురయ్యాడు. ఆ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దీగ్ జిల్లాలోని బేధమ్ గ్రామంలో గత నెల రోజుల నుంచి మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేదు. నెట్‌వర్క్ సమస్య కారణంగా గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోవటంతో ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే పుష్కర్ అనే వ్యక్తి తీవ్ర మనోవేధనకు గురై ఊరి బయట ఉన్న సెల్‌ఫోన్ టవర్ ఎక్కాడు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు అతడిని కిందకు దిగమని ప్రాధేయపడ్డారు. నెట్‌వర్క్ సమస్య పరిష్కరించే వరకు కిందకు దిగనని అతడు తేల్చిచెప్పాడు. సమస్య పరిష్కారం చేయకపోతే కిందకు దూకి ప్రాణాలు తీసుకుంటానన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పుష్కర్‌ను కిందకు దిగమని, సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. నెట్‌వర్క్ సమస్య పరిష్కారం అయిన తర్వాతే దిగుతానని పుష్కర్ తేల్చి చెప్పాడు.
పోలీసులు జియో టెక్నికల్ స్టాఫ్‌ను పిలిపించారు. జియో టీమ్ నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించింది. మూడున్నర గంటల పాటు అందరినీ ముప్పుతిప్పలు పెట్టిన అతడు.. పోలీసులు, టెలికామ్ అధికారులతో మాట్లాడిన తర్వాత కిందకు దిగాడు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ శరణ్ కంబ్లే మీడియాతో మాట్లాడుతూ.. ‘మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా రావటంలేదని ఓ యువకుడు మొబైల్ టవర్ ఎక్కాడని మాకు సమాచారం అందింది. ఈ అలర్ట్ వచ్చిన వెంటనే, సదర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకి దించడంలో పోలీసులు విజయం సాధించారు’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
కొంగు నడుముకు చుట్టి.. కొడవలి చేతపట్టి...
జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్