ఇంధన కొరత లేదు
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:41 AM
దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయని వెల్లడించింది...
దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రో నిల్వలు
సరఫరాలో ఆటంకాలు లేవు
40కి పైగా ప్రపంచ సరఫరాదారుల నుంచి క్రూడ్ ఆయిల్ వస్తోంది
దేశంలో రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి
ఎల్పీజీ కూడా సమృద్ధిగా ఉంది
వదంతులను నమ్మొద్దు.. భయం వద్దు
తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు.. కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి 26: దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇంధనం విషయంలో భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఆయిల్ సరఫరాలో కూడా ఎలాంటి ఆటంకాలు లేవని తెలిపింది. అన్ని రిటైల్ అవుట్‌లెట్లలో చాలినంత నిల్వలు ఉన్నాయని చెప్పింది. ఇంధన కొరత ఉందంటూ కొందరు సృష్టిస్తున్న వదంతులను నమ్మవద్దని, భయపడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర చమురు, సహజవాయు మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వివరాల ప్రకారం.. ‘‘హోర్ముజ్ జలసంధి వద్ద ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 40 మంది సరఫరాదారుల నుంచి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముడి చమురు దేశానికి వస్తోంది. దేశంలోని ఆయిల్ రిఫైనరీలు కూడా వంద శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశంలో అందరికీ సరిపోయేలా 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ, రిజర్వు నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపోతుంది. ఇంధన నిల్వలు ఆరు రోజులకు మాత్రమే సరిపోతాయంటూ ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొన్ని పోస్టులు, వీడియోలతో ప్రజల్లో లేనిపోని భయాన్ని సృష్టిస్తున్నారు. అధికారిక సమాచారంపై మాత్రమే ప్రజలు ఆధారపడాలి. పశ్చిమాసియా సంక్షోభం మొదలై 27 రోజులైంది. దేశంలో రెండు నెలల పాటు స్థిరంగా సరఫరా చేయడానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి.
అదనంగా నిల్వలు సేకరించడానికి కూడా తగిన చర్యలు తీసుకున్నాం. వచ్చే నెలలకు కూడా ఇంధన భద్రత కల్పిస్తాం. అన్ని అవుట్‌లెట్లు సాధారణంగానే నడుస్తున్నాయి. ఇంధన సరఫరాలో ఎక్కడా పరిమితులు లేవు. అతి పెద్ద రిఫైనరీలు కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో మన దేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది. సోషల్ మీడియాలో వదంతులతోనే ప్రజలు భయపడి పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. అలాగే దేశంలో ఎక్కడా ఎల్పీజీ కొరత లేదు. సరఫరాను కూడా బలోపేతం చేశాం. దేశీయ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. రోజువారీ అవసరాల్లో 50 శాతం పైగా దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. దీనివల్ల దిగుమతులు కూడా తగ్గాయి. ఇదే సమయంలో అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి భారీగా ఎల్పీజీ వస్తోంది. దేశవ్యాప్తంగా ఎలాంటి సమస్యలు లేకుండా రోజుకు 50 లక్షల సిలిండర్ల డెలివరీ జరుగుతోంది. మొదట్లో కొద్దిగా పెరిగిన డిమాండ్ ఇప్పుడు సాధారణ స్థాయికి చేరుకుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే పైప్డ్ నేచురల్ గ్యాస్‌ని ప్రోత్సహిస్తున్నాం. అంతేతప్ప ఎల్పీజీ కొరత వల్ల కాదు. 2014లో 25 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1.5 కోట్లకు చేరింది’’ అని పేర్కొంది.