విధుల్లో ఉండగానే 550 మంది ఉద్యోగులకు ఇన్నోడేటా ఉద్వాసన!
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:29 AM
అమెరికాకు చెందిన డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ‘ఇన్నోడేటా’ భారత్‌లో దాదాపు 550 ఉద్యోగులను విధుల్లో ఉండగానే అకస్మాత్తుగా తొలగించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 27: అమెరికాకు చెందిన డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ‘ఇన్నోడేటా’ భారత్‌లో దాదాపు 550 ఉద్యోగులను విధుల్లో ఉండగానే అకస్మాత్తుగా తొలగించింది. భారత్‌తోపాటు ఫిలిప్పీన్స్‌లో ఉన్న తమ టీమ్‌లో కూడా ఉద్యోగాల కోత చేపట్టింది. ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, ఫోన్ కాల్ గానీ లేకుండానే... ఉద్యోగులు పని చేసుకుంటుండగా వారి వ్యక్తిగత ఈ మెయిళ్లకు టెర్మినేషన్ లేఖలు పంపి ఉన్నపళంగా సాగనంపింది. ఈ నెల 26న (సోమవారం) ఉద్యోగులు ఎప్పటిలాగే విధులకు హాజరయ్యారు. కొద్దిసేపు పని చేసుకున్నారు. లంచ్ సమయానికి సంస్థలోని కొంతమందిని తొలగించారన్న వార్తలు వ్యాపించడంతో వారిలో గందరగోళం నెలకొంది. వెంటనే తమ మేనేజర్లను ఆరా తీయగా.. వారు కూడా ఆ వార్త విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా తొలగించిన వారి అధికారిక ల్యాప్‌టాప్‌లు ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోయాయి. దీంతోపాటు కంపెనీ ఐడీ కార్డులు, హెచ్‌ఆర్ పోర్టల్, పేరోల్ యాప్ యాక్సె్‌సలను కూడా యాజమాన్యం తక్షణమే డీయాక్టివేట్ చేసింది.