భారత సెమీకండక్టర్స్‌కు నెదర్లాండ్స్ దన్ను
ABN , Publish Date - May 18 , 2026 | 02:45 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బూమ్‌తో ప్రపంచమంతా సెమీకండక్టర్లు, చిప్‌లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించేందుకు నెదర్లాండ్స్ ముందుకొచ్చింది.
టాటా-డచ్ సంస్థల భాగస్వామ్యంతో గుజరాత్‌లో భారీ కంపెనీ
డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు.. 17 ఒప్పందాలు
నెదర్లాండ్స్ పర్యటన ముగించుకొని స్వీడన్ చేరుకున్న భారత ప్రధాని
ది హేగ్, మే 17: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బూమ్‌తో ప్రపంచమంతా సెమీకండక్టర్లు, చిప్‌లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించేందుకు నెదర్లాండ్స్ ముందుకొచ్చింది. భారత పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, నెదర్లాండ్స్ కంపెనీ ఏఎస్ఎంఎల్ సంయుక్తంగా గుజరాత్‌లోని ధోలేరాలో భారీ సెమీకండక్టర్ కంపెనీని నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాలుగు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం) నెదర్లాండ్స్‌లో ఆ దేశ ప్రధాని ప్రధాని రాబ్ జెట్టెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇద్దరు ప్రధానుల సమక్షంలో ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తంగా రెండు దేశాల మధ్య వివిధ రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, క్రిటికల్ మినరల్స్, శాస్త్రసాంకేతిక రంగం, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ మార్పులు, ఇంధనం, సముద్ర రవాణా, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో పరస్పరం సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. చర్చల అనంతరం ఇద్దరు ప్రధానులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ సంక్షేమం దృష్ట్యా హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచి వాణిజ్య నౌకల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని, ఉక్రెయిన్, రష్యాలు వెంటనే యుద్ధాన్ని ఆపేసి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా-ఇరాన్ యుద్ధ వల్ల పశ్చిమాసియాలో ఏర్పడిన కల్లోల పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం నెదర్లాండ్స్ మద్దతు ప్రకటించింది. ‘నెదర్లాండ్స్‌లో నా పర్యటన రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. సాధారణ సంబంధాలను అనేక రంగాల్లో వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లింది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తన పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లోని ప్రధాన కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో దాదాపు 300మంది సీఈవోలు పాల్గొన్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని మోదీ ఆహ్వానించారు. నెదర్లాండ్స్ పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ ఆదివారం స్వీడన్ చేరుకున్నారు. కాగా, డచ్ ప్రధాన రాబ్ జెట్టెన్‌తో కలిసి ప్రఖ్యాత జలాశయం అఫ్‌స్లుట్‌డెక్ డ్యామ్‌ను మోదీ సందర్శించారు. నీటి నిర్వహణలో ఈ డ్యామ్ ప్రపంచంలోనే ఒక అద్భుతంగా పేరుగాంచింది. ఇది 32 కిలోమీటర్ల పొడవైన డ్యామ్ కమ్ కాజ్‌వే. దీనిని 1932లో నిర్మించారు. ఈ డ్యామ్ ఉత్తర సముద్రాన్ని(వాడెన్ సీ), ఇస్సెల్‌మీర్ మంచినీటి సరస్సును వేరు చేస్తుంది. 90 ఏళ్లుగా వరదల నుంచి నెదర్లాండ్స్‌లోని చాలా భూభాగాన్ని ఈ డ్యామ్ కాపాడుతోంది. సముద్రం మధ్యలో ఈ కాజ్‌వేను 300 ఫీట్ల వెడల్పుతో నిర్మించారు.
మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం
నెదర్లాండ్స్ నుంచి స్వీడన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశానికి చెందిన గ్రిపెన్ యుద్ధ విమానాలు గౌరవ సూచకంగా మోదీ విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చాయి. వాటి రక్షణలో మోదీ స్వీడన్‌లోని రెండో అతిపెద్ద నగరం గోతెన్‌బర్గ్‌లో ల్యాండ్ అయ్యారు. ఆయనకు స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్‌సన్ స్వయగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీకి క్రిస్టెన్‌్‌స.. స్వీడన్ అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ను ప్రకటించారు. మోదీకి ఇప్పటివరకు లభించిన అంతర్జాతీయ పౌర పురస్కారాల్లో ఇది 31వది. ఆదివారం సాయంత్రం మోదీకి స్వీడన్ ప్రధాని విందు ఇచ్చారు.