Share News

మంచుకొండ వల్లే మహా విలయం!

ABN , Publish Date - Aug 27 , 2026 | 05:37 AM

నేపాల్‌లో బుధవారం సంభవించిన జల విలయానికి ఒక హిమానీనది విరిగి నదిలో కలవటమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. భోటెకోశీ నది విశ్వరూపానికి సంబంధించిన...

మంచుకొండ వల్లే మహా విలయం!

  • భూకంపంతో లిండే ఖోలా నదిలో పడిన

  • 2,000 అడుగుల వెడల్పు మంచు ఫలకం

  • అటు నుంచి భోటెకోశి నదిలో కలిసిన

  • భారీ మంచు, నీరు, బురద రాశి

  • అరగంటలో 30 అడుగులు పెరిగిన వరద

న్యూఢిల్లీ, ఆగస్టు 26: నేపాల్‌లో బుధవారం సంభవించిన జల విలయానికి ఒక హిమానీనది విరిగి నదిలో కలవటమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. భోటెకోశీ నది విశ్వరూపానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు, స్థానికులు తీసిన వీడియోలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పలువురు భూవిజ్ఞాన, హిమానీనద పరిశోధకులు.. భారీ మొత్తంలో మంచు ఒక్కసారిగా నదిలో కలవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. నేపాల్‌- టిబెట్‌ సరిహద్దుల్లో ఉన్న భోటెకోశీ నదికి త్రిశూల్‌, లెండే ఖోలా ఉపనదులు ఉన్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రాంతంలో రిక్టర్‌స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో గల్ఛీ ప్రాంతానికి ఎగువన 4 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిమానీనదిలోని దాదాపు 2,000 అడుగుల వెడల్పైన మంచు ఫలకం వేరుపడి ఒక్కసారిగా లెండే ఖోలా నదిలో పడిందని యూనివర్సిటీ ఆఫ్‌ కాల్గరీకి చెందిన భూవిజ్ఞాన పరిశోధకుడు డేనియల్‌ షుగర్‌ తెలిపారు. ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని చెప్పారు. అంతపెద్ద మంచు ముక్క ఒక్కసారిగా నదిలో కలవటంతో ఆ ప్రాంతంలో ఉన్న మట్టి, రాళ్లను భారీ మొత్తంలో నదిలోకి తోసుకొచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ మంచు, రాళ్లు, మట్టి, నీళ్లు కలిసిన ప్రవాహం అత్యంత వేగంగా భోటెకోశీ నదిలో కలవటంతో పెద్ద బాంబు పేలినట్లుగా జల విస్ఫొటం జరిగిందని తెలిపారు. అత్యంత ఎత్తయిన ప్రాంతం నుంచి శరవేగంగా దూసుకొచ్చిన ప్రవాహం తనకు అడ్డుగా ఉన్న ప్రతీ కట్టడాన్ని ధ్వంసం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయిందని యూనివర్సిటీ ఆఫ్‌ డుండీకి చెందిన గ్లేసియాలజిస్టు సైమన్‌ కుక్‌ వివరించారు.

మరోవైపు ఈ విలయానికి కొండచరియలు విరిగిపడటం కూడా కారణం అయి ఉండవచ్చని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఈ జల విలయం కారణంగా భోటెకోశీ నదీ వ్యవస్థపై ఉన్న 12 జలవిద్యుత్‌ కేంద్రాలతోపాటు అనేక వంతెనలు నామరూపాల్లేకుండా పోయాయి. ఈ ప్రవాహం భోటెకోశీ నదిలో నుంచి త్రిశూల్‌ నదిలోకి కూడా ఎదురు తన్నటంతో ఆ నదిలో ప్రవాహం అమాంతం పెరిగిపోయి.. దానికి ఇరువైపులా ఉన్న గ్రామాలు, పట్టణాలను పూర్తిగా తనలో కలిపేసుకుంది. ఈ ప్రవాహం ఎంత విధ్వంసకరంగా ఉందంటే.. గల్ఛీ వద్ద 30 నిమిషాల్లోనే నదీ ప్రవాహం దాదాపు 30 అడుగులకు పెరిగింది.

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 27 , 2026 | 05:37 AM