వరదల్లో చిక్కుకున్న 57మంది తమిళులు
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:28 AM
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడులోని తంజావూరు, తిరువారూరు, మైలాడుతురై జిల్లాలకు చెందిన 57 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నారు. ఆదివారం...
20 మంది సురక్షితం.. 37 మంది ఆచూకీ గల్లంతు
టిబెట్‌లో తలదాచుకుంటున్న కర్నూలు జిల్లా చెందిన నలుగురు
చెన్నై/ఆదోని, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడులోని తంజావూరు, తిరువారూరు, మైలాడుతురై జిల్లాలకు చెందిన 57 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నారు. ఆదివారం రాత్రి కుంభకోణంలోని సూపర్‌యాత్ర ట్రావెల్స్ సంస్థ ద్వారా వారు మానస సరోవర్ యాత్రకు బయలుదేరారు. ఆ యాత్రికులు బుధవారం మూడు వాహనాలలో టిబెట్ నుంచి ఖాట్మండ్‌కు ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వరదలు సంభవించినట్లు సూపర్‌యాత్ర ట్రావెల్స్ యజమాని సాదిక్ చెప్పారు. తమ వాహనాల్లోని రెండు వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయని, ప్రయాణికుల్లో 20మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. తక్కిన 37 మంది తమ వెంట తీసుకెళ్లిన అన్ని వస్తువులను కోల్పోయారని బుధవారం ఉదయం తెలిసిందని, సాయంత్రం నుంచి వారి సమాచారం తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా వాసులు నలుగురు టిబెట్‌లోని డార్చెన్ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆదోని పట్టణంలోని ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న, ఒకే కుటుంబానికి చెందిన రంగనాథ్, హన్సిక, శారద, భాస్కర్ శాస్త్రి యాత్రకు వెళ్లారు. వారి యాత్ర ముగిసిన తరుణంలో నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదలతో అంతా స్తంభించిపోయింది. నేపాల్ మీదుగా స్వదేశానికి వచ్చే దారి మూసుకుపోవడంతో కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్న డార్చెన్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఉండిపోయారు. అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అక్కడి నుంచి భాస్కర్ తమ పరిస్థితిని ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్ ద్వారా వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..