కేంద్రం తన హామీని నిలబెట్టుకుంది.. విద్యార్థులపై ఎలాంటి చర్యలు ఉండవు: జేపీ నడ్డా..
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:11 PM
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు.
కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు.
కాగా, నీట్ పేపర్ లీక్‌తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..
మమతా బెనర్జీ మేనకోడలు మృతి!