Share News

‘నీట్‌’పై దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - May 14 , 2026 | 05:05 AM

నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీ ఘటనపై దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో...

‘నీట్‌’పై దర్యాప్తు ముమ్మరం

  • పేపర్‌ లీకేజీ ఘటనలో ఐదుగురి అరెస్టు

న్యూఢిల్లీ, జైపూర్‌, మే 13: నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీ ఘటనపై దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో జైపూర్‌కు చెందిన దినేశ్‌ బివాల్‌, మంగీలాల్‌ బివాల్‌, వికాస్‌ బివాల్‌, గురుగ్రాంకు చెందిన యశ్‌యాదవ్‌, నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నర్‌ ఉన్నారు. దినేశ్‌ బివాల్‌ స్థానికంగా బీజేపీలో పని చేస్తున్న నేపథ్యంలో.. లీకేజీ ఘటన రాజకీయ రంగును పులుముకుంది. లీకేజీ వెనుక బీజేపీ హస్తం ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, కేరళలో ఎంబీబీఎస్‌ చదువుతున్న రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ విద్యార్థి నుంచి పేపర్‌ లీకేజీ ప్రక్రియ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ విద్యార్థి నీట్‌ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత తన స్నేహితులకు షేర్‌ చేయటమేగాక సికార్‌లోని ఓ హాస్టల్‌ యజమానికి పంపించినట్లు సమాచారం. హాస్టల్‌ యజమాని సదరు విద్యార్థి తండ్రి అన్న వార్తలు వచ్చాయిగానీ.. అది వాస్తవం కాదని తేలింది. ఈ హాస్టల్‌ యజమానే పేపర్‌ లీకేజీకి సంబంధించి తొలుత పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. లీకేజీ వ్యవహారంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న నాసిక్‌కు చెందిన 30 ఏళ్ల శుభం ఖైర్నర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకొని విచారణ కోసం ఢిల్లీకి తీసుకొచ్చింది. నాసిక్‌ నుంచే ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా పలువురిని ప్రశ్నిస్తున్నామని, వారిలో కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ అధికారులు వెల్లడించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి కూడా ఓ సీబీఐ బృందం బుధవారం వెళ్లింది. నీట్‌ పరీక్ష నిర్వహణలో పాలుపంచుకున్న అధికారులను ప్రశ్నించారు.


బీజేపీ నేత ప్రమేయంపై విమర్శలు

సీబీఐ అరెస్టు చేసిన వారిలో రాజస్థాన్‌లోని జామ్‌వరంగఢ్‌కు చెందిన బీజేపీ నేత దినేశ్‌ బివాల్‌తోపాటు అతడి సోదరుడు మంగీలాల్‌ బివాల్‌ ఉన్నారు. జామ్‌వరంగఢ్‌ నియోజకవర్గంలో బీజేపీలో చురుకైన కార్యకర్తగా దినేశ్‌ బివాల్‌కు పేరుంది. దినేశ్‌ అరెస్టు నేపథ్యంలో.. గతంలో ఆయన బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌తో కలిసి దిగిన ఫొటోలను కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ.. ‘బీజేపీ నేత దినేశ్‌ బివాల్‌ ప్రమేయం ఉన్నందునే లీకేజీ ఘటనను రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయటం లేదంటూ నేను రెండు రోజులుగా అడుగుతున్నా కూడా నమోదు చేయలేదు. పేపర్‌ లీకేజీ మాఫియాను బీజేపీ ప్రభుత్వం కాపాడుతోంది’ అని ఆరోపించారు. దినేశ్‌ బివాల్‌, మంగీలాల్‌ బివాల్‌ సోదరులు బీజేపీ నాయకులని, వారికి ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖతో సంబంధాలు ఉండవచ్చని.. ఈ నేపథ్యంలోనే పేపర్‌ లీకేజీలో కీలక పాత్ర పోషించారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కీర్తి ఆజాద్‌ ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 05:05 AM