నీట్ పరీక్షపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - May 15 , 2026 | 11:50 AM
నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నీట్‌ను నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పేపర్ లీక్ కారణంగా నీట్ పరీక్ష రద్దైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా స్పందించారు. మాల్‌ప్రాక్టీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పేపర్ లీక్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని అన్నారు. ఎగ్జామ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో మరో రెండు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నామని అన్నారు. విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు పూర్తిస్థాయిలో రీఫండ్ చేస్తామని చెప్పారు. జూన్ 21న జరగనున్న రీఎగ్జామ్‌కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.
తమకు అనువైన నగరంలో పరీక్ష రాసేందుకు వీలుగా ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుందని కూడా మంత్రి చెప్పారు. నీట్ పరీక్ష వివాదం విషయంలో ఎలాంటి వదంతులను నమ్మవద్దని కూడా మంత్రి సూచించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి రాధాకృష్ణన్ కమిటీ మార్గదర్శకాలను అమలు చేస్తున్నమని అన్నారు. అయినప్పటికీ లోపం తలెత్తిందని అంగీకరించారు.
తదుపరి నీట్ పరీక్షల తీరుతెన్నులపై కూడా మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రశ్నపత్రాలకు బదులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పేపర్ లీక్ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యాశాఖ పూర్తి బాధ్యత తీసుకుందని చెప్పారు. ఇక జూన్ 21న నీట్‌ను మరోసారి నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల ముందు అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయని కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు