కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ
ABN , Publish Date - May 15 , 2026 | 04:50 AM
ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సంజయ్‌సింగ్, వినయ్ మిశ్రా, సౌరభ్ భరద్వాజ్‌లపై ...
సిసోడియా, సంజయ్‌సింగ్, వినయ్ మిశ్రా, భరద్వాజ్‌లపైనా జస్టిస్ స్వర్ణకాంత శర్మ చర్యలు
ఈ చర్యలు కోపంతో తీసుకున్నవి కావు
రాజ్యాంగానికి కట్టుబడే ఈ నిర్ణయం
ఈ ఉత్తర్వులు కోర్టులో ఇస్తున్నాం బీజేపీ ఆఫీసులో కాదని వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సంజయ్‌సింగ్, వినయ్ మిశ్రా, సౌరభ్ భరద్వాజ్‌లపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం సాగించారనే ఆరోపణలపై గురువారం స్వచ్ఛందంగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు. అదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. 2021-22 ఢిల్లీ మద్యం విధానం కేసులో కేజ్రీవాల్, టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో సహా 23 మందిని ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దానిపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ జస్టిస్ స్వర్ణకాంత శర్మ వద్ద నుంచి కేసు విచారణను మరో ధర్మాసనానికి మార్చాలని కేజ్రీవాల్, ఇతర నేతలు కోరారు. ఈ కేసును విచారించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ కీలక నిర్ణయాలను ప్రకటించారు. కేజ్రీవాల్‌పై తాను కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో.. అదే కేసును తాను విచారించడం సబబు కాదని జస్టిస్ స్వర్ణకాంత శర్మ అభిప్రాయపడ్డారు. ‘‘నేను ఈ కేసు విచారణ కొనసాగిస్తే.. తనపై వ్యక్తిగత కక్షతో తీర్పు ఇచ్చారని కేజ్రీవాల్ భావించే అవకాశం ఉంది. అందుకే ఈ కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించా. రాజ్యాంగ ధర్మాన్ని కాపాడే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని వివరించారు. తాను ఒక లా కాలేజీలో ప్రసంగించిన వీడియోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి.. ఆర్‌ఎస్‌ఎస్ వేడుకలో మాట్లాడినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘‘కేజ్రీవాల్ దుష్ప్రచారానికి తెరలేపారు. న్యాయమూర్తి వీడియోలను ఎడిట్ చేసి పోస్ట్ చేయడం దురుద్దేశపూరిత చర్య. నన్ను ఎగతాళి చేయాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. రాజకీయ శక్తుల అంచనాలకు తగ్గట్టు న్యాయమూర్తి నడుచుకోకపోతే, కించపరుస్తామనే సంకేతాన్ని కేజ్రీవాల్ పంపుతున్నారు. ఈ ధోరణిని ఉపేక్షిస్తే న్యాయవ్యవస్థకే ముప్పు’’ అని జస్టిస్ స్వర్ణకాంత పేర్కొన్నారు. ఇక వినయ్ మిశ్రా చేసిన ఒక పోస్ట్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘ఈ ఉత్తర్వు న్యాయస్థానంలో జారీ అవుతోంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాదు. వినయ్ మిశ్రా.. నేను మీపై ధిక్కార చర్య తీసుకుంటున్నాను, ’’ అని స్పష్టం చేశారు.