నీట్ పేపర్ లీక్..!?
ABN , Publish Date - May 12 , 2026 | 05:28 AM
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేత్తో రాసిన ‘గెస్ పేపర్’ లేదా...
ఓ ప్రాక్టీస్ బ్యాంక్‌లోని 135 ప్రశ్నలు వాస్తవ ప్రశ్నపత్రంలోనూ ఉన్నాయి!
విచారణ జరుపుతున్న రాజస్థాన్ పోలీసులు
న్యూఢిల్లీ, మే 11: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేత్తో రాసిన ‘గెస్ పేపర్’ లేదా శాంపిల్/ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్‌లో 281 ప్రశ్నలు ఉన్నాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్ పరీక్షకు ముందు రాజస్థాన్‌లో బాగా సర్క్యులేట్ అయింది. అయితే, ఇందులో 135 ప్రశ్నలు వాస్తవ పరీక్షలోని ప్రశ్నలతో సరిపోలాయి. ఈ ఘటనపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) దర్యాప్తు చేపట్టింది. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు రెండు రోజుల ముందు (ఈ నెల 1న) అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్లు పేర్కొన్నారు. ఇందులో బయాలజీ ప్రశ్నలు 90, కెమిస్ట్రీ ప్రశ్నలు 45 ఉన్నట్లుగా గుర్తించారు. నీట్ మొత్తం 720 మార్కులకు కాగా.. ఈ ప్రశ్నలు 600 మార్కులతో సమానమని పేర్కొంటున్నారు. అయితే, ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా? లేక ఎవరైనా పేపర్ లీక్ చేశారా? అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదని గుర్తించారు. అతను మే 1న సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని.. ఆ తర్వాత అది పీజీ వసతి గృహాలు, కోచింగ్ నెట్‌వర్క్‌లు, పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చేరిందని వెల్లడించారు. ఈ ఘటనపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పందించింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం తెలిసిందని పేర్కొంది. ఈ విషయాన్ని పారదర్శకంగా పరిశీలించి, పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్