Share News

2025లోనూ నీట్ పేపర్ లీక్ అయిందా?.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - May 15 , 2026 | 04:07 PM

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌కు చెందిన కుటుంబం గతంలోనూ వైద్య ప్రవేశ పరీక్షల పేపర్లను లీక్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

2025లోనూ నీట్ పేపర్ లీక్ అయిందా?.. వెలుగులోకి సంచలన విషయాలు
NEET 2026 Paper Leak Case

ఢిల్లీ: నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌కు చెందిన కుటుంబం గతంలోనూ వైద్య ప్రవేశ పరీక్షల పేపర్లను లీక్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజస్థాన్ పోలీసుల సమాచారం ప్రకారం.. జైపూర్ జిల్లా జంవా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్ సోదరులు ఈ ఏడాది మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసి విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ ఇద్దరు సోదరులు రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్లకు ప్రశ్నపత్రాలు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా తమ కుటుంబ సభ్యుల కోసం ప్రశ్నపత్రాలను సేకరించి, అనంతరం ఇతరులకు భారీ మొత్తాలకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా బివాల్ కుటుంబానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు పరీక్షకు ముందే నీట్ 2025 ప్రశ్నాపత్రం అందినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మంగీలాల్ కుమారుడు వికాస్ బివాల్ ప్రస్తుతం సవాయి మాధోపూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అతడికి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నపత్రాల సేకరణ, పంపిణీ కోసం నిందితులు రూ.65 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.


ఈ మొత్తం వ్యవహారం కోచింగ్ సెంటర్ల మాఫియా ఆధ్వర్యంలో సాగిందని.. ఇది సాధారణ పేపర్ లీక్ కేసు కాదని అంటున్నారు. సంవత్సరాలుగా వ్యవస్థీకృతంగా నడుస్తున్న అక్రమ నెట్‌వర్క్ అని పేర్కొంటున్నారు. సికార్‌లోని కోచింగ్ సంస్థల మధ్య పోటీ, అంతర్గత విభేదాల కారణంగానే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.


నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి కొత్త తేదీలను ప్రకటించడమే కాకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రశ్నపత్రం లీక్ జరిగిన విషయాన్ని అంగీకరించారు. వ్యవస్థలో లోపం జరిగిందని.. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నీట్ విద్యార్థి రితిక్ ఆత్మహత్యకు బాధ్యులెవరు?: ప్రియాంక గాంధీ

భోజ్‌శాల ఆలయ కేసులో ఇండోర్‌ కోర్టు కీలక తీర్పు

Updated Date - May 15 , 2026 | 04:50 PM