నీట్ పరీక్ష రద్దు
ABN , Publish Date - May 13 , 2026 | 05:42 AM
ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో.. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ (యూజీ)-2026 పరీక్షను ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ) రద్దు చేసింది. వచ్చే వారం పది రోజుల్లో కొత్త...
పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎన్‌టీఏ నిర్ణయం
మళ్లీ కొత్తగా పరీక్ష.. వారం పది రోజుల్లో తేదీల వెల్లడి
కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు.. ఫీజు రిఫండ్
రద్దు.. విద్యార్థులకు ఇబ్బంది కలిగించే నిర్ణయమే
కానీ, పరీక్షలపై ఉన్న నమ్మకం వమ్ము కావద్దనే!
తప్పునకు బాధ్యత వహిస్తున్నాం: ఎన్‌టీఏ చీఫ్
సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం
కేసు నమోదు.. పలు రాష్ట్రాలకు సీబీఐ బృందాలు
గెస్ పేపర్ పేరుతో ప్రశ్నపత్రం లీకేజీ..
కెమిస్ట్రీ, బయాలజీలో అవే ప్రశ్నలు
నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటకు?
రూ.30 వేల నుంచి రూ.28 లక్షల వరకూ
ధర నిర్ణయించి విక్రయించిన ఏజెంట్లు
ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల
కోచింగ్ సెంటర్లకు గెస్ పేపర్
రాజస్థాన్‌లోని ఓ హాస్టల్ నిర్వాహకుడి ద్వారా
ఎన్‌టీఏకి సమాచారం
రాజస్థాన్‌లో కోటాకు పోటీగా ఎదుగుతున్న
సికార్.. ఈ నేపథ్యంలోనే పేపర్ లీకేజీ?
లీకేజీ, పరీక్ష రద్దుపై విద్యార్థి సంఘాల నిరసన
న్యూఢిల్లీ, ముంబై, జైపూర్, మే 12: ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో.. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ (యూజీ)-2026 పరీక్షను ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ) రద్దు చేసింది. వచ్చే వారం పది రోజుల్లో కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. కేంద్ర సంస్థల సమన్వయంతో తాము స్వయంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ నిర్వహించటం అనేక మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఇబ్బంది కలిగించే నిర్ణయమేనని, అయితే, పరీక్షల వ్యవస్థపై ఉన్న నమ్మకం వమ్ము కాకుండా కాపాడేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. పరీక్ష కొత్త తేదీలను, కొత్త అడ్మిట్‌కార్డుల జారీ వివరాలను తమ అధికారిక చానళ్ల ద్వారా వెల్లడిస్తామని.. తాము జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, ఇతరత్రా ఊహాగానాలు నమ్మవద్దని సూచించింది. ‘కొత్తగా పరీక్షకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదనపు పరీక్ష ఫీజు కట్టాల్సిన పని లేదు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి రిఫండ్ చేస్తాం. కొత్తగా నిర్వహించే పరీక్షను మా అంతర్గత వనరులతోనే నిర్వహిస్తాం’ అని స్పష్టం చేసింది. ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. మే 3వ తేదీన జరిగిన పరీక్షలో నాలుగు సెట్‌ల ప్రశ్నాపత్రాలున్నాయని, వాటిలో మొత్తానికి మొత్తంగా ఏదీ లీకేజీ కాలేదని చెప్పారు. అయితే, బయట పంపిణీ అయిన ఓ కాపీలోని కొన్ని ప్రశ్నలు మాత్రం ప్రశ్నాపత్రాల్లో వచ్చాయని తెలిపారు. ‘ఒక్క ప్రశ్న విషయంలో అలా జరిగినా కూడా అది మేం నిర్దేశించుకున్న ప్రమాణాలకు విఘాతం కలిగినట్లే. అందుకే మళ్లీ పరీక్ష జరపాలని నిర్ణయించాం’ అని వివరించారు. ప్రస్తుత పరిణామంతో దేశంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యావత్ వ్యవస్థ ప్రభావితమవుతోందన్నారు. తప్పు జరిగిందని, దానికి తాము బాధ్యత వహిస్తున్నామని చెప్పారు. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అభిషేక్‌సింగ్ తెలిపారు.
సీబీఐ దర్యాప్తు ప్రారంభం
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వివిధ రాష్ట్రాలకు పలు బృందాలను పంపించింది. ఇప్పటి వరకూ ఈ అంశంపై దర్యాప్తు జరిపిన రాజస్థాన్ పోలీసుల నుంచి వివరాలు సేకరించనుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ నెల 3వ తేదీన నీట్ (యూజీ)-2026 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 23 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 96.92 శాతం మంది హాజరయ్యారు. పరీక్ష రద్దు నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన దుస్థితి నెలకొంది. పేపర్ లీకేజీపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎస్‌ఎ్‌ఫఐ, ఎన్‌ఎ్‌సయూఐ తదితర విద్యార్థి సంఘాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ సామర్థ్యంపై విద్యార్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌టీఏ బదులు నీట్‌ను ఎయిమ్స్-ఢిల్లీ నిర్వహించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను విలేకరులు మంగళవారం ప్రశ్నించగా.. ఆయన స్పందించలేదు. కాగా, పేపర్ లీకేజీ వార్తలపై ఎన్‌టీఏ ఆదివారం ఎక్స్‌లో స్పందిస్తూ.. లీకేజీ అక్రమాల గురించి తమకు ఈ నెల 7వ తేదీ సాయంత్రం తెలిసిందని, దీనిపై స్వతంత్ర విచారణ కోసం మరుసటి రోజు ఉదయం కేంద్ర సంస్థలకు తాము తెలియజేశామని వెల్లడించింది.
గెస్ పేపర్ పేరుతో లీకేజీ!
పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడటానికి ముందు ఓ గెస్ పేపర్ బయట చక్కర్లు కొట్టింది. దీంట్లో ఉన్న పలు ప్రశ్నలే.. నీట్ పరీక్షలో వచ్చాయి. దీంతో ఈ గెస్ పేపర్ ఎలా బయటకు వచ్చిందన్నదానిపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. లీకేజీ ఘటనకు కేంద్రబిందువుగా భావిస్తున్న రాజస్థాన్‌లో.. పోలీసుల ‘స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్’ (ఎస్‌ఓజీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఆ రాష్ట్ర అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ మీడియాతో మాట్లాడుతూ, ‘పరీక్ష జరగటానికి నెల రోజుల ముందు నుంచే ఈ గెస్ పేపర్ విద్యార్థుల్లో తిరుగుతోంది. దాంట్లో 410 ప్రశ్నలు ఉన్నాయి. వీటిలోంచి నీట్ కెమిస్ట్రీ పరీక్ష పేపర్ నాలుగు సెట్లకు సంబంధించి 120 ప్రశ్నలు యథాతథంగా వచ్చాయి. ఈ గెస్ పేపర్ ఎలా బయటకు వచ్చింది అన్న దాని మీద కేంద్రీకరించాం’ అని తెలిపారు. కాగా, నీట్ పరీక్ష పత్రం మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రింట్ అవుతుందని, అక్కడి నుంచే పేపర్ లీకేజీ జరిగిందన్న సందేహాలున్నాయి. ఇది వాస్తవం కాదని, నాసిక్‌లో ప్రింటింగ్ జరగటం లేదన్నది మరో వాదన. పోలీసు వర్గాల ప్రకారం.. నాసిక్ నుంచి బయటకొచ్చిన పేపర్ హరియాణాలోని గురుగ్రాంకు చెందిన ఓ డాక్టర్ వద్దకు చేరింది. ఈ డాక్టర్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉండే ఓ వ్యక్తి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి అదే రాష్ట్రంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లకు నెలవైన సికార్‌లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్న రాకేశ్ కుమార్ వద్దకు చేరుకుంది. ఇక్కడి నుంచి గెస్ పేపర్ పేరుతో పలు రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్లకు వెళ్లింది. వీటిలో ఏపీ, తెలంగాణకు చెందినవి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ గెస్ పేపర్‌ను రూ.30 వేల నుంచి కొన్ని లక్షల రూపాయల వరకు ధర పెట్టి అమ్మేశారు. కోచింగ్ తీసుకోవటానికి సికార్‌కు వచ్చిన నాగ్‌పూర్‌నకు చెందిన ఓ విద్యార్థి ఏకంగా రూ.28 లక్షలు చెల్లించి కొనుక్కున్నాడు. సాధారణంగా ఈ అక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంటాయి. అయితే, ఈసారి ఏజెంట్లు ఒకర్ని మించి మరొకరు సొమ్ము చేసుకునే ఉద్దేశంతో విచ్చలవిడిగా పేపర్‌ను అమ్మటంతో ఈ వ్యవహారం బయటపడింది.

హాస్టల్ నిర్వాహకుడి నుంచి ఎన్‌టీఏకి సమాచారం
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్ రాకేశ్‌కుమార్ కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికార్‌కు చెందిన ఓ విద్యార్థికి రూ.30 వేలకు ఈ గెస్ పేపర్‌ను అమ్మాడు. ఈ విద్యార్థి తండ్రి సికార్‌లోనే విద్యార్థులకు ఓ హాస్టల్ నడుపుతున్నారు. పరీక్ష జరగటానికి ఒక రోజు ముందు సదరు విద్యార్థి గెస్‌పేపర్‌ను తన తండ్రికి పంపించాడు. దానిని హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు ఆయన అందజేశాడు. మే 3వ తేదీన పరీక్ష జరిగిన తర్వాత గెస్‌పేపర్‌లోని ఎన్ని ప్రశ్నలు వాస్తవంగా వచ్చాయని ఆయన పరిశీలిస్తే.. బయాలజీలోని మొత్తం 90 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు వచ్చినట్లు తెలిసింది. ఇది గెస్ పేపర్ కాదు.. ఏకంగా పేపర్ లీకేజీనేనని గుర్తించి స్థానికంగా ఉన్న పోలీసులకు చెప్పగా.. వాళ్లు కొట్టిపడేశారు. దీంతో ఆయన ఎన్‌టీఏకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఎన్‌టీఏ.. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు తెలియజేసింది. వారి ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరిలో రాకేశ్‌కుమార్, ఎంబీబీఎస్ విద్యార్థి కూడా ఉన్నారు. ఆ విద్యార్థి తండ్రి అయిన హాస్టల్ నిర్వాహకుడిని కూడా ప్రశ్నించారు. మంగళవారం నాసిక్‌లో శుభం ఖైర్నర్ అనే బీఏఎంఎస్ విద్యార్థిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రూ.10 లక్షలతో గెస్ పేపర్‌ను శుభం కొన్నాడని, ఆ తర్వాత హరియాణాకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడని సమాచారం.
డైపర్లు కూడా లీక్ కావు కదా!
అరె... చిన్న పిల్లలకు తొడిగే 10 రూపాయల డయపర్లు, పాంపర్లు కూడా లీక్ కావు... ఎన్టీయే ప్రశ్న పత్రాలు మాత్రం ఎడాపెడా లీక్ అయిపోతుంటాయి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడతారా? ఎన్టీయే అన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు... నెవర్ ట్రస్టబుల్ ఏజెన్సీగా మారిపోయింది. సీబీఐతో కాదు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు జరపండి. విద్యను వ్యాపారంగా మార్చిన కోచింగ్ నెట్‌వర్క్‌లపైనా విచారణ జరిపించండి. - ఖాన్ సర్, విద్యావేత్త
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News