ఎన్‌సీపీఐలో అభిప్రాయభేదాలు.. బీజేపీకి మద్దతుపై ముగ్గురు సభ్యుల అభ్యంతరం!
ABN , Publish Date - Aug 10 , 2026 | 08:24 AM
టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో (ఎన్‌సీపీఐ) అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి. బీజేపీకి మద్దతుపలకడంపై ముగ్గురు ఎసీపీఐ ఎంపీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది ఎంపీలు ఇటీవల ఎసీపీఐలో చేరిన విషయం తెలిసిందే.
ఎన్‌సీపీఐ బీజేపీకి మద్దతుగా ఉండటంపై ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో వారు పార్టీ సమావేశాలకు కూడా హాజరుకావట్లేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీజేపీకి దగ్గరైనట్టు కనిపిస్తే తమకు ఎంతో కాలంగా అండగా ఉంటున్న ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ విషయంలో అభిప్రాయాలు ఉన్నప్పటికీ ముగ్గురు ఎంపీలు ఇటీవల బిర్భూమ్ ఎంపీ శతాబ్దీ రాయ్‌తో కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. అంతేకాకుండా, ప్రధాని నివాసంలో అల్పాహార విందుకు కూడా హాజరయ్యారు.
అయితే, బీజేపీ విధానాలతో తాము ఏకీభవించలేమని ముగ్గురు ఎంపీలు తెలిపారు. కానీ, వివిధ సంక్షేమ పథకాల ఫలాలు తమ నియోజకవర్గ ప్రజలకు చేరేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరిస్తామని అన్నారు. గత వారం ఎన్డీయే ఎంపీల మంగళ్ మిలన్ సమావేశంలో ఎన్‌సీపీఐ తరఫున 17 మంది ఎంపీలే హాజరయ్యారు. ఖాన్, రెహ్మాన్, పఠాన్ మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఇక శనివారం ఎంపీలు ఖాన్, రెహ్మాన్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసి సర్‌తో ముర్షిదాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించారు. ‘ఎన్డీయేతో మేము కలిసేది లేదని ముందే చెప్పాము. కానీ ముస్లిం వర్గం, ముఖ్యంగా వెనకబడ్డ వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు సీఎం అంగీకరించారు’ అని అబూ తాహెర్ ఖాన్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఈ-20తో దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు: కేజ్రీవాల్
యువత భవిష్యత్తు కంటే పదవి ముఖ్యం కాదు