ఈ-20తో దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు: కేజ్రీవాల్
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:17 AM
ఈ20 పెట్రోలు విధానం దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఈ20 పెట్రోలు విధానం దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఇంజన్లు దెబ్బతింటాయన్న భయంతో ప్రజలు పెట్రోలు కార్లు కొనడం మానేశారని తెలిపారు. ఇథనాల్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకపోతే అది ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని ‘ఎక్స్’లో ఆదివారం చేసిన పోస్టులో ఆయన పేర్కొన్నారు. ఈ20 పెట్రోలుకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిందని, గోవా, గుజరాత్, జమ్మూ, కశ్మీర్‌ల్లోని ఆప్ ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహా తీర్మానాన్ని ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రవేశపెడతారని చెప్పారు. ఇథనాల్ కలిపిన పెట్రోలును ప్రోత్సహించాలని భావిస్తే దానిని తక్కువ ధరకే విక్రయించాలని సూచించారు.