Share News

సార్వత్రిక సమ్మె ప్రభావం పాక్షికం

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:32 AM

కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం జరిగిన దేశవ్యాప్త సమ్మె.. జన జీవనంపై పాక్షిక ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, జాతి వ్యతిరేక, కార్మికుల వ్యతిరేక, రైతుల వ్యతిరేక...

సార్వత్రిక సమ్మె ప్రభావం పాక్షికం

  • పలు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన

  • సమ్మెకు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల మద్దతు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం జరిగిన దేశవ్యాప్త సమ్మె.. జన జీవనంపై పాక్షిక ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, జాతి వ్యతిరేక, కార్మికుల వ్యతిరేక, రైతుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగిన సమ్మెకు ఒడిసా, కేరళ, తమిళనాడు, గోవా, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించింది. సమ్మెలో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. ప్రజా రవాణా, మార్కెట్లు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు పని చేయలేదు. జాతీయ, రాష్ట్రీయ రహదారులు సహా ప్రధాన రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకింగ్‌, పోస్టల్‌, బీమా, రవాణా, ఆరోగ్య, విద్యుత్‌, గనులు, తదితర రంగాలపై సమ్మె ప్రభావం చూపింది. సమ్మెకు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కార్మికులు నిరసన తెలపడంతో తమిళనాడులోని నౌకాశ్రయాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. కేరళ ప్రభుత్వం సమ్మెకు మద్దతునివ్వడంతో ప్రభుత్వ కార్యాలయాలు, షాపులు, వ్యాపార సంస్థలు పని చేయలేదు. పంజాబ్‌లోనూ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సమ్మెకు మద్దతు పలికింది. పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, గుజరాత్‌లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. దేశమంతటా అమల్లోకి వచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లు రద్దు చేయడంతోపాటు విత్తన బిల్లు ముసాయిదా, విద్యుత్‌ సవరణ బిల్లు, శాంతి బిల్లులను ఉపసంహరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు మద్దతు పలికిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు, కేంద్ర కార్మిక చట్టాలు, అమెరికాతో మోదీ ప్రభుత్వ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. కార్మికులు, రైతుల వాణిని మోదీ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 06:32 AM