Share News

ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు

ABN , Publish Date - Mar 23 , 2026 | 07:19 AM

భారత రాజకీయ యవనికపై నరేంద్ర మోదీ మరో అజేయ రికార్డును లిఖించారు. ప్రభుత్వాధిపతిగా (ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా కలిపి) అత్యధిక కాలం సేవలందిస్తున్న నాయకుడిగా...

ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు

సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్‌ను అధిగమించిన ప్రధాని మోదీ

  • 13 ఏళ్లకుపైగా గుజరాత్‌ ముఖ్యమంత్రి..

12 ఏళ్లుగా ప్రధానమంత్రిగా బాధ్యతలు

న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): భారత రాజకీయ యవనికపై నరేంద్ర మోదీ మరో అజేయ రికార్డును లిఖించారు. ప్రభుత్వాధిపతిగా (ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా కలిపి) అత్యధిక కాలం సేవలందిస్తున్న నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పేరిట ఉన్న 8,930 రోజుల ప్రభుత్వాధినేత రికార్డును ఆయన ఆదివారం అధిగమించారు. మొత్తం 8,931 రోజులతో దేశంలోనే సుదీర్ఘకాలం పాలించిన నేతగా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు, బీజేపీ నేతలు మోదీపై ప్రశంసలు కురిపించారు. చామ్లింగ్‌ సిక్కిం సీఎంగా నిరాటంకంగా 8,930 రోజులు పనిచేశారు. మోదీ 2001 అక్టోబరు 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. 2014 మే 22 వరకు.. 13.5 ఏళ్లకుపైగా కొనసాగారు. సుదీర్ఘకాలం ఆ రాష్ట్ర సీఎంగా పనిచేయడం కూడా రికార్డే. ఆ వెంటనే మే 24న ప్రధానిగా ప్రమాణం చేశారు. నాటి నుంచి వరుసగా మూడోసారి ఆ పదవిలో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. మన్మోహన్‌(వరుసగా పదేళ్లు) కంటే ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న రికార్డు కూడా ఆయనదే. ప్రభుత్వ నాయకత్వ పాత్రలో 25వ ఏట అడుగుపెట్టారు. ఇందిరాగాంధీ కూడా దీర్ఘకాలం ప్రధానిగా ఉన్నా.. రెండు దఫాలుగా కొనసాగారు. 1966 నుంచి 77 వరకు, 1980 నుంచి 84 అక్టోబరు 31న మరణించేవరకు ఆ పదవిలో (15 ఏళ్లు) ఉన్నారు. ఆమె తండ్రి, భారత ప్రథమ ప్రధాని నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న కన్నుమూసేదాకా దాదాపు 17 ఏళ్లు పదవిలో కొనసాగారు. మోదీ ఈ ఏడాది మరో రెండు రికార్డులు సాధించారు. ఆయన యూట్యూబ్‌ చానల్‌ ఈ నెల మొదట్లో 3 కోట్ల సబ్‌స్ర్కైబర్లకు చేరుకుంది. గత నెలలో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య పది కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత మంది ఫాలోవర్లు ఉన్న మొదటి ప్రపంచనేత, రాజకీయ నాయకుడిగా ఆయన చరిత్రకెక్కారు.


కేంద్ర మంత్రుల ప్రశంసలు..

8,931 రోజులు అప్రతిహతంగా ప్రభుత్వాధినేతగా కొనసాగడం.. దేశానికే ప్రథమ ప్రాధాన్యం, సమగ్ర కార్యాచరణ, ప్రతిపౌరుడికీ అవిరామ సేవలో మోదీకి ఉన్న లోతైన నిబద్ధతను చాటుతోందని రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గత 24 ఏళ్లకు పైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం ‘ప్రధాన్‌ సేవక్‌’ మోదీ పని చేస్తున్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం. పేదలకు హక్కులు కల్పించడం, అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు నిర్మించడం, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠను పెంచడం ద్వారా ’మోదీ యుగం‘ భారతదేశ రూపురేఖలను మార్చివేసింది’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. మోదీ సారథ్యంలో ‘వికసిత్‌ భారత్‌’ విజన్‌ దిశగా ఇండియా సాగుతోందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రధానిగా మోదీ హయాంలో మౌలిక వసతుల విస్తృతి, డిజిటల్‌ విప్లవం, ప్రజాసంక్షేమ పథకాల సమర్థ అమలు, ఆత్మనిర్భర భారత్‌ దిశగా దేశం శీఘ్ర అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్‌ నితిన్‌ అన్నారు.

మై యంగ్‌ ఫ్రెండ్‌.. ఓమీ!

మోదీ ఒడిలో ఆడుకుంటున్న ఈ చిన్నారి పేరు నియోమ్‌ అశ్విన్‌ కృష్ణ. ముద్దుగా పిలుచుకునే పేరు ‘ఓమీ’. ఈ బాబు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దియా కృష్ణ కుమారుడు. కేరళ నటుడు, బీజేపీ నేత కృష్ణ కుమార్‌ మనవడు. కృష్ణకుమార్‌ తన కుటుంబంతో కలిసి ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటసేపు వారు మోదీతో గడిపారు. ఈ ఫొటోను మోదీ ‘7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌కు వచ్చిన యంగ్‌ ఫ్రెండ్‌తో..’ అన్న క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. గంటల వ్యవధిలోనే దీనికి 17 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 07:20 AM