నాగాలాండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. పలువురి మృతి, గల్లంతు!
ABN , Publish Date - Jul 19 , 2026 | 05:29 PM
నాగాలాండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మోన్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు సహా ఎనిమిది మంది మరణించినట్టు సమాచారం.
గువాహటి/కోహిమా, జులై 19: నాగాలాండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మోన్ (Mon) జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు సహా ఎనిమిది మంది మరణించి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదలు (Flash floods) కూడా పోటెత్తాయి.
ముమ్మరంగా సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మోన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వెన్న్యేయ్ కొన్యాక్ ఈ ప్రమాదంపై వివరాలు అందిస్తూ... 'ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నాము. ఇప్పటివరకు శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగాము. గల్లంతైన మిగిలిన వారి కోసం ఆ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' అని తెలిపారు.
ప్రస్తుతం మూన్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల