ఇళ్లకు వెళ్లి వార్నింగ్.. వాట్సాప్ లైవ్ లొకేషన్ షేర్ చేయాలని ఒత్తిడి.. ముంబై పోలీసులపై ఆరోపణలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:00 PM
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలపై కొనసాగుతున్న సీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థి ఉద్యమం ముంబైలోనూ ఉద్ధృతమవుతోంది. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను అడ్డుకునేందుకు ముంబై పోలీసులు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలపై కొనసాగుతున్న సీజేపీ (CJP) ఆధ్వర్యంలోని విద్యార్థి ఉద్యమం ముంబైలోనూ ఉద్ధృతమవుతోంది. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను అడ్డుకునేందుకు ముంబై పోలీసులు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై, లీగల్ నోటీసులు అందుకున్న వారిపై పోలీసులు నిఘా వేశారని సమాచారం (Mumbai Police).
పోలీసులు నేరుగా తమ ఇళ్లకు వచ్చి హెచ్చరించారని, వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో నిరసనల్లో పాల్గొన్న వారిని పోలీసులు స్టేషన్లకు పిలిచి గంటల తరబడి విచారించారని, కొందరి మొబైల్ ఫోన్లను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక, గతంలో జరిగిన నిరసనలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కోరుతూ, కొందరికి తెల్లవారుజామున మెసేజ్‌లు జారీ అయినట్టు కూడా సమాచారం (Mumbai Student protests).
ముంబైలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు భారీగా విద్యార్థులు, యువత హాజరవుతున్నారు. కొన్ని చోట్ల నిరసనకారులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, వారిని చెదరగొట్టడం వంటి చర్యలు కూడా చోటుచేసుకున్నాయి. ముంబై ప్రధాన మెట్రో, రైల్వే స్టేషన్లలో పోలీసులు మోహరించారు. నిరసన జరిగే ప్రదేశాల వైపు వెళ్తున్న వారిని గుర్తించి, దారి మళ్లిస్తున్నారు (NEET paper leak).
ఢిల్లీలో సీజేపీ నేతృత్వంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా ముంబైలో కూడా నిరసనలు జరుగుతున్నాయి. పరీక్షల అవకతవకలు, ఢిల్లీలో సీజేపీ నిరసనకారులపై పోలీసుల అణచివేతకు నిరసనగా, రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, విద్యార్థులు నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నెతన్యాహు ఓ వార్ క్రిమినల్.. అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి: న్యూయార్క్ మేయర్
పసిడి ధరలు మరికొంత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..