మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముంబై కోర్టు నో
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:13 AM
పౌరవిమానయాన శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఎయిరిండియా మాజీ సీఎండీ అశ్వనీ లొహానీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలంటూ దాఖలైన పిటిషన్ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది.
2017నాటి విమాన భద్రత ఉల్లంఘనలపై కేసు పెట్టాలన్న పిటిషన్ కొట్టివేత
ముంబై, అక్టోబరు 14: పౌరవిమానయాన శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఎయిరిండియా మాజీ సీఎండీ అశ్వనీ లొహానీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలంటూ దాఖలైన పిటిషన్ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2017లో విమాన భద్రత ఉల్లంఘనలకు సంబంధించి వారితో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులపై కేసు పెట్టాలని విమానయాన అధికారి కేవీ జగన్నాథరావు తన పిటిషన్లో కోరారు. ఆ ఏడాది జనవరి 19న పైలట్ కెప్టెన్ అరవింద్ కథ్పాలియా బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకోకుండానే ఢిల్లీ-బెంగళూరు వివ నం ఏఐ-174ను నడిపారని.. దీనిపై ఫిర్యాదు చేసినా అదే రోజు రాత్రి రిటర్న్ ఫ్లైట్ ఏఐ-173ని కూడా ఆయన నడిపారని.. అయినా తాను పరీక్షకు వెళ్లినట్లు రిజిస్టర్లో ఎంట్రీ వేయించుకున్నారని ఆరోపించారు.
డీజీసీఏ అప్పటి జాయింట్ డైరెక్టర్ జనరల్ లలిత్ గుప్తా ఫిబ్రవరి 15న విచారణ చేపట్టి.. కథ్పాలియా ఫ్లయింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేశారని తెలిపా రు. అయితే ఆయన ప్రవర్తనను డీజీసీఏ గానీ, ఎయిరిండియా గానీ పరిశీలించలేదని.. నాటి మంత్రి అశోక్, సీఎండీ లొహానీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని కోరారు. అయితే కథ్పాలియాపై మాత్రమే పోలీసు విచారణకు మేజిస్ట్రేట్ కోర్టు 2018లో ఆదేశించింది. మంత్రి, సీఎండీ, మిగతా ఉన్నతాధికారులపై ఫిర్యాదును డిస్మిస్ చేసింది. దీనిపై జగన్నాథరావు ముంబై అదనపు సెషన్స్ జడ్జి కోర్టు(దిండోశీ కోర్టు)ను ఆశ్రయించారు. అయితే మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి న్యాయాధికారి మొహి యుద్దీన్ నిరాకరించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కథ్పాలియాపై దాఖలైన ఎఫ్ఐఆర్, చార్జిషీటు, ఇతర న్యాయపరమైన ప్రొసీడింగ్స్ అన్నిటినీ ఢిల్లీ హైకోర్టు క్వాష్ చేసిందని.. అలాంటప్పుడు ఇతర ప్రతివాదులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఎలా ఆదేశాలిస్తామని ప్రశ్నించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..