349 కిలోల కొకైన్ ముంబైలో పట్టివేత
ABN , Publish Date - May 02 , 2026 | 06:26 AM
దేశ ఆర్థిక రాజధాని ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లోని లాజిస్టిక్ కారిడార్స్‌లో భారీగా మాదకద్రవ్యాల దందాకు పాల్పడుతున్న అంతర్జాతీయ కొకైన్ సిండికేట్ గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో...
దాని విలువ రూ.1,745 కోట్లు
ముంబై, మే 1: దేశ ఆర్థిక రాజధాని ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లోని లాజిస్టిక్ కారిడార్స్‌లో భారీగా మాదకద్రవ్యాల దందాకు పాల్పడుతున్న అంతర్జాతీయ కొకైన్ సిండికేట్ గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు రట్టు చేశారు. వారి నుంచి రూ.1,745 కోట్ల విలువ చేసే 349 కిలోల అత్యున్నత శ్రేణి కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘వైట్ స్ట్రైక్’ అనే సంకేత నామంతో నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా.. ఎన్సీబీ అధికారులు మాదకద్రవ్యాల అక్రమరవాణా దందాపై 6నెలలపాటు నిఘా పెట్టి, కీలక సమాచారాన్ని సేకరించి.. పక్కా ప్రణాళికతో, సమన్వయంతో నవీముంబై-థానే జిల్లాల్లోని కలంబొలి-భీవండీ కారిడార్‌లో దాడులు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఎన్సీబీ అధికారులు.. కలంబోలి ప్రాంతంలో ఒక మారుతీ సుజుకీ కారును అడ్డగించి, అందులో తనిఖీలు చేయగా 136 కిలోల కొకైన్ దొరికింది. ఒక్కొక్కటీ కిలో చొప్పున మొత్తం 136 ప్యాకెట్లలో కొకైన్ నింపి దాన్ని క్రికెట్ ప్యాడ్లు, గ్లవ్స్ మధ్య దాచి, ఆ కారులో తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించి, అతడిచ్చిన సమాచారం ఆధారంగా.. భీవండీలోని ఒక గిడ్డంగిలో దాచిన 213 కిలోల కొకైన్‌ను (కిలో ప్యాకెట్లు 213) స్వాధీనం చేసుకున్నారు. ‘‘దిగుమతి చేసుకున్న యంత్రాల ఖాళీ భాగాల్లో ఈ కొకైన్‌ను విదేశాల నుంచి అక్రమంగా తరలించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఒక్కో ప్యాకెట్‌నూ తొమ్మిది పొరల పాలిథిన్ కవర్‌లో చుట్టి, నల్లటి జిడ్డు కోటింగ్ వేశారు.’’ అని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్సీబీ అధికారులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. చిన్న క్లూ ఆధారంగా ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించడం అభినందనీయమన్నారు.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ