కేసీపీ కమాండర్ హావోబిజామ్ దిలీప్ సింగ్ అరెస్టు
ABN , Publish Date - May 28 , 2026 | 08:05 AM
మణిపూర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ కాంగ్లేపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కేసీపీ) కీలక కమాండర్ హావోబిజామ్ దిలీప్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో రహస్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన దిలీప్ సింగ్‌ని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ: మణిపూర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ కాంగ్లేపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కేసీపీ) కీలక కమాండర్ హావోబిజామ్ దిలీప్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో రహస్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరించే దిశగా రహస్య సమావేశం నిర్వహించేందుకు దేశ రాజధానికి వచ్చినట్లు తెలుస్తోంది. భద్రతా సంస్థలు చాలా కాలంగా అతని కదలికలపై నిఘాపెట్టాయి.
ఢిల్లీలో ఉన్నాడని పక్కా సమాచారం అందిన వెంటనే దిలీప్ సింగ్‌ని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, మణిపూర్ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు సంయుక్త ఆపరేషన్ చేపట్టి కేసీపీ కమాండర్‌ని పట్టుకున్నారు. కాగా, దిలీప్ సింగ్‌పై 12కు పైగా ఉపా (UAPA) కేసులు ఉన్నాయి. చాలా కాలం నుంచి అతను మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. మరోవైపు విచారణలో అతని నెట్‌వర్క్ సహా కీలక సమాచారం లభిస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇటీవల మణిపూర్‌లోని కాక్చింగ్ ప్రాంతంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దిలీప్ సింగ్ సమాచారం ఆధారంగానే ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఆపరేషన్‌లో ఏకే 56 రైఫిల్, అమోఘ్ రైఫిల్, ఏఐ రైఫిల్, స్కోప్‌తో కూడిన ఎం-4 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇన్సాస్, ఏకే, ఎస్ఎల్ఆర్, ఎం-4, ఎల్ఎంజీ రైఫిళ్లకు చెందిన అనేక ఖాళీ మ్యాగజైన్లు లభించాయి. 51 హెచ్ఈ బాంబులు, రెండు పారా బాంబులు, 11 డిటోనేటర్లు, నాలుగు లెథోడ్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. అమోఘ్, ఇన్సాన్, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్‌కు చెందిన దాదాపు 2,000 లైవ్ రౌండ్ల మందుగుండు సామగ్రి లభించింది.
ఈ వార్తలు కూడా చదవండి
బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర రక్షణ కోసం.. BSFకు 142 ఎకరాల భూమిచ్చిన బెంగాల్ సర్కారు
క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్న పశ్చిమ బెంగాల్ పోలీసులు.. గూండాలను అర్ధనగ్నంగా రోడ్లపై..