మహిళలకు టీఎంసీ ద్రోహం
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:35 AM
ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య ‘మహిళా బిల్లు’ మంటలు రేపింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేదికగా మోదీ చేసిన విమర్శలకు...
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు
బంకురా/పురూలియా/న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య ‘మహిళా బిల్లు’ మంటలు రేపింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేదికగా మోదీ చేసిన విమర్శలకు మమతా దీదీ దీటుగా సమాధానమిచ్చారు. మహిళలకు టీఎంసీ ద్రోహం చేసిందని మోదీ విమర్శిస్తే.. ప్రధాని కాస్త నిజాయతీగా మాట్లాడి ఉంటే బాగుండేదంటూ దీదీ చురకలు అంటించారు. ఆదివారం బెంగాల్‌లోని బంకురా, పురూలియా, మేదినీపూర్, ఝార్‌గ్రామ్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. మహిళలకు టీఎంసీ ఎనలేని ద్రోహం చేసిందని.. ఆ పార్టీకి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు తగిన శిక్ష విధించడం ఖాయమని పేర్కొన్నారు. ‘‘దేశ అభివృద్ధిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలని మేం భావించాం. కానీ పార్లమెంటులో ఏం జరిగిందో మీరంతా చూశారు. టీఎంసీ కాంగ్రె్‌సతో కలిసి ఆ పార్టీ కుట్ర చేసి రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంది’’ అని మోదీ ఆరోపించారు. పొరుగుదేశాల నుంచి వస్తున్న అక్రమ వలసదారులకు టీఎంసీ సహకరిస్తోందని.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు మద్దతు ఇస్తోందని అన్నారు. అక్రమ చొరబాట్ల కారణంగా బెంగాల్ భాష, సంస్కృతి దెబ్బతింటున్నాయని వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్ల పాలనలో టీఎంసీ ప్రభుత్వం బెంగాల్‌ను దోపిడీ చేయడంలో పీహెచ్‌డీ సాధించిందని మోదీ విమర్శించారు. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మమత మండిపడ్డారు. ‘‘మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను అడ్డు పెట్టుకుని డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దీనినే మేం వ్యతిరేకిస్తున్నాం. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి మేం ఎప్పుడూ అండగానే ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. లోక్‌సభలోని టీఎంసీ ఎంపీల్లో 37.9ు, రాజ్యసభలోని టీఎంసీ ఎంపీల్లో 46ు మంది మహిళలేనని గుర్తు చేశారు. మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టించే బదులు నిజాయితీగా మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు.
పది రూపాయల మరమరాలు కొనుక్కొని తిన్న ప్రధాని మోదీ!
ఆదివారం పశ్చిమబెంగాల్‌లో సుడిగాలి పర్యటన చేసిన మోదీ.. మధ్యలో ఓ చోట ఆగి ‘ఝల్‌మురి’ కొనుక్కుని తిన్నారు. జార్‌గ్రామ్ పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం వద్దకు వెళ్లి.. ‘భాయ్ నాకు కాస్త ఝల్‌మురి తినిపించు (భాయ్ హమే అప్నా ఝల్‌మురి ఖిలావో)’ అని అడిగారు. పది రూపాయలు ఇచ్చి ఝల్‌మురి తీసుకుని.. దుకాణం వద్ద గూమిగూడిన వారితో మాట్లాడుతూ తిన్నారు. దీనికి సంబంధించి మోదీ ఎక్స్‌లో వీడియోను, ఫొటోలను పోస్టు చేశారు. భేల్‌పురీ తరహాలో ఉండే ‘ఝల్‌మురి’ని మరమరాలు, కాస్త ఆవనూనె, సన్నగా తరిగిన టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం వేసి కలిపి తయారు చేస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో