Share News

మోదీ సర్కారుకు రెండో ఎదురుదెబ్బ!

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:21 AM

ఎన్ని ఆందోళనలు తలెత్తినా.. ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా.. పార్లమెంటును స్తంభింపజేసినా.. గత 13 ఏళ్లుగా మోదీ సర్కారు చాలా అంశాల్లో మొండిగానే ముందుకెళ్లింది...

మోదీ సర్కారుకు రెండో ఎదురుదెబ్బ!

2021లో రైతుల ఆందోళనలతో తొలి దెబ్బ.. మూడు వ్యవసాయ చట్టాలపై వెనక్కి

న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎన్ని ఆందోళనలు తలెత్తినా.. ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా.. పార్లమెంటును స్తంభింపజేసినా.. గత 13 ఏళ్లుగా మోదీ సర్కారు చాలా అంశాల్లో మొండిగానే ముందుకెళ్లింది. చాలాసార్లు తాము అనుకున్నదే చేసింది. కొన్నింటి విషయంలో కాస్త తగ్గినా.. రెండు సార్లు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అందులో ఒకటి 2021 నాటి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంకాగా, రెండోది తాజాగా విద్యా మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సి రావడం. రెండుసార్లు కూడా ప్రతిపక్షాల ఆందోళనలు, రభస కంటే కూడా ప్రజల పోరాటాల సెగ ఎక్కువగా తగలడం గమనార్హం.

మూడు ‘నల్ల’ చట్టాలపై రైతుల పోరాటం

మార్కెట్‌ సంస్కరణల్లో భాగంగా మోదీ ప్రభుత్వం 2020లో మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించింది. ఈ సాగు చట్టాల మూలంగా కనీస మద్దతు ధర వ్యవస్థ దెబ్బతింటుందని, చిన్న రైతులు కార్పొరేట్ల దోపిడీకి గురవుతారనే ఆందోళన వ్యక్తమైంది. 2021 మొదట్లో పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించి ఆందోళనలకు దిగారు. ఎండ, చలి, వానను తట్టుకుని నెలలకొద్దీ పోరాటం చేశారు. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు, ఈ క్రమంలో జరిగిన దాడులు, ఆత్మహత్యలతో 700 మందికిపైగా రైతులు మరణించినట్టు అంచనా. కేంద్ర మంత్రులు ఎంత ఒత్తిడి తెచ్చినా రైతులు పోరాటం కొనసాగించారు. దీనితో మోదీ ప్రభుత్వం దిగొచ్చింది. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని 2021 నవంబర్‌ 19న గురునానక్‌ జయంతి రోజున ప్రధాని మోదీ ప్రకటించారు. నవంబర్‌ 29న పార్లమెంట్‌లో ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటూ బిల్లు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ హామీలను అమలు చేయడంతో రైతులు 378 రోజుల పాటు చేసిన ఆందోళనను డిసెంబర్‌ 11న ఉపసంహరించుకున్నారు. మోదీ ప్రభుత్వానికి తగిలిన తొలి పెద్ద ఎదురుదెబ్బ అదే. తాజాగా కాక్రోజ్‌ జనతాపార్టీ ఆధ్వర్యంలో జెన్‌ జీ యువత, విద్యార్థుల ఆందోళనకు తలొగ్గి విద్యా మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో రాజీనామా చేయించడం రెండో పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.


కొన్నిసార్లు తగ్గి..కొన్ని సార్లు మొండిగా..

  • 2018లో ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకున్న సమయంలో.. పలువురు మహిళా జర్నలిస్టుల ఆరోపణలతో నాటి విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామా చేశారు.

  • 2023లో మణిపూర్‌లో రెండు వర్గాల మఽధ్య సుదీర్ఘకాలం జరిగిన హింసాకాండ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా రోజులు ప్రేక్షక పాత్ర వహించింది. చివరకు రాష్ట్రపతి పాలనతో సరిపెట్టింది.

  • 2018-2020 మఽధ్య పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆర్నెల్లకు పైగా ఆందోళనలు జరిగాయి. కానీ కోవిడ్‌ మూలంగా అవి సద్దుమణిగాయి.

  • 2022 జూన్‌లో సైన్యంలో నియామకాలకు సంబంధించిన అగ్నివీర్‌ పథకానికి నిరసనగా ఆందోళనలు జరిగినా మోదీ సర్కార్‌ తలొగ్గలేదు.

  • లద్దాఖ్‌ స్వతంత్ర ప్రతిపత్తి కోసం జరిగిన ఆందోళనకు కూడా చలించని మోదీ సర్కార్‌.. ఆ ఆందోళనకు నేతృత్వం వహించిన సామాజికవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను నిర్బంఽఽధించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:21 AM