Share News

జెన్‌జీపై మోదీ సర్కార్‌ ఉక్కుపాదం

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:20 AM

ఏకంగా 30 వేల మందికిపైగా పోలీసులు, సాయుధ బలగాల మోహరింపు, నలుగురు కూడా గుమిగూడకుండా నిషేధాజ్ఞలు, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత, 45 మెట్రో స్టేషన్ల మూసివేత, దాదాపు 250 రైళ్ల రద్దు, రోడ్ల మీద అడుగడుగునా బారికేడ్లు, గగనతలంలో డ్రోన్లతో నిఘా, నలుగురు మాజీ సీఎంలతోపాటు ఎక్కడికక్కడ జెన్‌జీ నిరసనకారుల అరెస్టులు, గృహ నిర్బంధాలు..శనివారం దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఇదీ.

జెన్‌జీపై మోదీ సర్కార్‌ ఉక్కుపాదం
dipke

cjp4.jpg

  • సీజేపీ ‘చలో జంతర్‌మంతర్‌’ మీద ఆంక్షలు

  • విమానం నుంచి దిగక ముందే అభిజీత్‌ దీప్కే, సౌరవ్‌దాస్‌, రంకా అరెస్టు

  • సంఘీభావం తెలిపిన కేజ్రీ, మమత, విజయన్‌, మాణిక్‌ సర్కార్‌లపై నిర్బంధం

  • ధ్రువ్‌రాఠీ హౌస్‌ అరెస్ట్‌.. పోలీసుల అదుపులో 7 వేల మంది.. ఇంటర్నెట్‌ బంద్‌

  • ఢిల్లీకొచ్చే 250 రైళ్ల రద్దు.. 45 మెట్రోస్టేషన్ల మూసివేత.. 30 వేల మంది బలగాలు

  • నిరసనకారులపై ప్రైవేటు వ్యక్తుల దాడులు

  • పట్టనట్లు చోద్యం చూసిన పోలీసులు

  • సీజేపీ ప్లాన్‌ బీ.. ఉద్యమానికి అజింక్యా నేతృత్వం.. ఉద్యమం ఆగదు: అజింక్యా

  • దేశంలో సూపర్‌ ఎమర్జెన్సీ: మమత

  • నిర్బంధకాండపై ఐరాస ఆందోళన

  • రేపు ఢిల్లీలో ఇండి కూటమి ప్రదర్శన: కాంగ్రెస్‌

  • ఉద్యమకారులను విడుదల చేయకపోతే మళ్లీ నిరాహారదీక్ష: సోనమ్‌ వాంగ్‌చుక్‌

  • మీ వెంటే మేం.. పోరాడండి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఏకంగా 30 వేల మందికిపైగా పోలీసులు, సాయుధ బలగాల మోహరింపు, నలుగురు కూడా గుమిగూడకుండా నిషేధాజ్ఞలు, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత, 45 మెట్రో స్టేషన్ల మూసివేత, దాదాపు 250 రైళ్ల రద్దు, రోడ్ల మీద అడుగడుగునా బారికేడ్లు, గగనతలంలో డ్రోన్లతో నిఘా, నలుగురు మాజీ సీఎంలతోపాటు ఎక్కడికక్కడ జెన్‌జీ నిరసనకారుల అరెస్టులు, గృహ నిర్బంధాలు..శనివారం దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఇదీ. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ చలో జంతర్‌మంతర్‌కు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసింది. ఢిల్లీ సరిహద్దుల నుంచి నిరసన వేదిక వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఆంక్షలను విధించింది. విమానాశ్రయం రన్‌వేపై నుంచి మొదలుకొని ఢిల్లీలోని గురుద్వారా ప్రాంగణం వరకు ఎక్కడికక్కడ నిరసనకారులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ముఖగుర్తింపు వ్యవస్థలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టి, బహుళ అంచెల బారికేడ్లను ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులు సైతం జంతర్‌మంతర్‌ చేరుకోలేని విధంగా పద్మవ్యూహాన్ని రచించారు.


cjp-protest1.jpgదీంతో ఢిల్లీ ఒక సైనిక కోటగా మారిపోయింది. జంతర్‌మంతర్‌ ధర్నాకు పిలుపునిచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, పార్టీ కీలక నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా.. శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో చేరుకోగానే.. ప్రయాణికులెవరూ విమానంలోకి దిగకముందే.. రన్‌వే మీద ఆగిన విమానంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించారు. వారిలో పలువురు మహిళా పోలీసులు ఉండటం విశేషం. జంతర్‌మంతర్‌ ధర్నాకు అనుమతి లేదని పేర్కొంటూ సీజేపీ నేతలను ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఒకే చోటికి కాకుండా వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. విమానంలో తమ అరెస్టు సందర్భంగా.. దీప్కే పోలీసులతో మాట్లాడుతూ ‘మేం అరెస్టుకు సిద్ధపడే వచ్చాం’ అని చెప్పారు. సీజేపీ నాయకులను నేరస్థుల్లా అదుపులోకి తీసుకుంటున్నారని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఇలా వ్యవహరించలేదని, ఇది నియంతృత్వమేనని దీప్కే ఆరోపించారు.

mamatha.jpg

నలుగురు మాజీ సీఎంల అరెస్టు

సీజేపీ ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఇండియా కూటమి అగ్రనేతలను పోలీసులు అరెస్టు చేశారు. సౌత్‌ అవెన్యూ బస్టాండ్‌ వద్ద బైఠాయించిన పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీని, ఆ పార్టీ ఎంపీలు డెరెక్‌ ఓబ్రెయిన్‌, డోలాసేన్‌ను నిర్బంధించి ఓ బస్సులో తరలించారు. మోదీ సర్కారు తీరును మమత తూర్పారబడుతూ.. ‘ఇది సూపర్‌ ఎమర్జెన్సీ’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ తన నోటికి బ్యాండ్‌ ఎయిడ్‌ వేసుకున్నారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ నివాసాన్ని ఉదయం నుంచే పోలీసులు చుట్టుముట్టారు. నిరసనలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయటకురాగానే ఆయనను, ఆమ్‌ఆద్మీపార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. సీపీఎం అగ్రనేతలు, మాజీ సీఎంలు విజయన్‌, మాణిక్‌ సర్కార్‌, ఆ పార్టీ ఎంపీ జాన్‌ బ్రిట్టా్‌సను పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్‌ స్టేడియానికి తరలించారు. ప్రముఖ విశ్లేషకుడు, యూట్యూబర్‌ ధ్రువ్‌రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలోనే పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు.


cjp3.jpgవిద్యార్థి సంఘం ఏఐఎస్ఏ నాయకురాలు నేహా బోరా, సీజేపీ న్యాయవ్యవహారాల విభాగం ఇంచార్జి రత్నాసింగ్‌, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి బేబీ, బృందాకారత్‌, దీపంకర్‌ భట్టాచార్య తదితరులను అరెస్టు చేశారు. హనుమాన్‌ ఆలయం, ఆకాశ్‌వాణి భవన్‌, సఫ్దర్‌జంగ్‌ ఫ్లైఓవర్‌, కేరళ హౌస్‌ తదితర ప్రాంతాల్లో గుమిగూడిన అనేక మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తమ్మీద, 7 వేల మందికిపైగా ఆందోళనకారులను నిర్బంధించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సీజేపీకి మద్దతుగా ముంబైలో కూడా నిరసనలు జరిగాయి. ఇక్కడ గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ సహా 600 మందికి పైగా నిరసనకారులను అరెస్టుచేశారు.

అడుగడుగునా నిర్బంధం

పోలీసుల నిర్బంధం నుంచి తప్పించుకునేందుకు పలువురు ఆందోళనకారులు కన్నాట్‌ప్లే‌స్‌లోని ప్రసిద్ధ గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో వెళ్లి తలదాచుకున్నారు. పోలీసులు లాఠీలు, తుపాకులతో లోపలికి చొరబడి నిరసనకారులను బయటకు ఈడ్చుకెళ్లారు. సీజేపీ ధర్నాకు సంఘీభావంగా న్యాయవాదులు సుప్రీంకోర్టు నుంచి జంతర్‌మంతర్‌ వైపు బయలుదేరగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జోక్యం చేసుకుని న్యాయవాదులను విడిపించారు. సీజేపీ ధర్నా నేపథ్యంలో, జనపథ్‌ పరిసరాల్లో 4కిలోమీటర్ల పరిధిలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి24 గంటలపాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 30 వేలమందికి పైగా సాయుధ బలగాలను మోహరించారు. రోడ్లపై స్పైక్‌ స్ట్రిప్స్‌, నాలుగు అంచెల కాంక్రీట్‌ బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. 45 మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసివేశారు. ఇతర రాష్ట్రాల నుంచి శుక్రవారం బయలుదేరి శనివారానికి న్యూఢిల్లీకి చేరకునే సుమారు 250 రైళ్లను రద్దు చేశారు.


cjp6.jpgఅమలులోకి సీజేపీ ప్లాన్‌ బీ

దీప్కే, సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ అరెస్టు కాగానే సోషల్‌ మీడియాలో సీజేపీ వీడియో విడుదల చేసింది. తమను పోలీసులు అరెస్టు చేస్తే.. జంతర్‌మంతర్‌ ఉద్యమాన్ని సీజేపీ జాతీయ సంస్థాగత ఇంచార్జ్‌ అజింక్యా షిండే ముందుకు తీసుకెళ్తారని దీప్కే ఈ వీడియోలో వెల్లడించారు. అనంతరం, అజింక్యా షిండే ఓ వీడియోలో మాట్లాడుతూ.. సీజేపీ ఉద్యమం కొనసాగుతుందని, ఆదివారం జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన ప్రదర్శన ఉంటుందని ప్రకటించారు. మోదీ ప్రభుత్వ భయమే తమ సగం విజయాన్ని చాటుతోందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

అంత్యక్రియలకు విమానంలో తీసుకెళ్తాం.. దీప్కేకు ఢిల్లీ పోలీసుల ఆఫర్

పార్కులో కూర్చున్నందుకే అరెస్ట్ చేశారు: బీజేపీ నాయకుడి కుమార్తె..

Updated Date - Oct 11 , 2026 | 05:21 AM