ప్రధాని మోదీ పొదుపు చర్యలు.. కాన్వాయ్‌లో కార్ల సంఖ్య కుదింపు?
ABN , Publish Date - May 13 , 2026 | 09:03 AM
ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. తన కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలని ప్రధాని ఆదేశించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా గత కొంతకాలంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడ్డ అనేక దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు కూడా వృథా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రధాని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని తన కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలని ఆదేశించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా, విద్యుత్ కార్ల వినియోగాన్ని పెంచాలని కూడా ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది.
మీడియా కథనాల ప్రకారం, కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను 50 శాతం మేర తగ్గించాలని ప్రధాని భద్రత దళం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు (ఎస్పీజీ) ఆదేశాలు అందాయి. భద్రతా ప్రొటోకాల్ పాటిస్తూనే పొదుపు చర్యలు చేపట్టాలని ఎస్పీజీకి సూచనలు వెళ్లినట్టు సమాచారం. ఈ దిశగా ఎస్పీజీ కార్యాచరణ మొదలెట్టినట్టు కూడా తెలుస్తోంది. తన కాన్వాయ్‌లో విద్యుత్ కార్ల సంఖ్యను పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లనే వినియోగించాలని, కొత్తవి కొనవద్దని కూడా ప్రధాని స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఈ తరహా పొదుపు చర్యలకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంధన పొదుపు కోసం ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై పలు శాఖలు సమీక్షలు జరుపుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంల కాన్వాయ్ కుదింపునకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత