Share News

చర్మ క్యాన్సర్‌పై మోడెర్నా బ్రహ్మాస్త్రం

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:22 AM

మెలనోమా (ఒక రకం చర్మ క్యాన్సర్‌) తిరగబెట్టకుండా నిలువరించేందుకు మోడెర్నా సంస్థ పర్సనలైజ్డ్‌ ఆర్‌ఎన్‌ఎంఏ టీకాను అభివృద్ధి చేసింది! 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా...

చర్మ క్యాన్సర్‌పై మోడెర్నా బ్రహ్మాస్త్రం

  • ఎంఆర్‌ఎన్‌ఏ టీకా ‘ఇంటిస్మెరాన్‌ ఆటోజీన్‌’ అభివృద్ధి

  • ‘కీట్రూడా’ ఔషధంతో కలిపి ఇస్తే

  • అద్భుత ఫలితాలు.. ట్రయల్స్‌ సక్సెస్‌

  • రెండూ తీసుకున్నవారిలో మెలనోమా

  • తిరగబెట్టే ముప్పు 49-50% మేర

  • తగ్గిపోయినట్టు వెల్లడి

  • 177% పెరిగిన మోడెర్నా షేర్ల విలువ

వాషింగ్టన్‌, ఆగస్టు 20: మెలనోమా (ఒక రకం చర్మ క్యాన్సర్‌) తిరగబెట్టకుండా నిలువరించేందుకు మోడెర్నా సంస్థ పర్సనలైజ్డ్‌ ఆర్‌ఎన్‌ఎంఏ టీకాను అభివృద్ధి చేసింది! 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా దాన్ని.. మెర్క్‌ సంస్థ గతంలోనే అభివృద్ధి చేసిన సుప్రసిద్ధ ఇమ్యూనోథెరపీ ఔషధంతో కలిపి ఇస్తే మెలనోమా బాధితుల్లో క్యాన్సర్‌ తిరగబెట్టే ముప్పు, మరణించే ప్రమాదం 49-50ు తగ్గిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. మోడెర్నా తయారుచేసిన ఆ ఎంఆర్‌ఎన్‌ఏ టీకా పేరు.. ‘ఇంటిస్మెరాన్‌ ఆటోజీన్‌’. దీన్నే వీ940, ఎంఆర్‌ఎన్‌ఏ-4157 అనే పేర్లతోనూ పిలుస్తున్నారు. ఇది మెలనోమా రాకుండా నివారించే టీకా కాదు. ఇప్పటికే మెలనోమా బారిన పడ్డవారికి సర్జరీ చేసి క్యాన్సర్‌ కణితులను తొలగించిన తర్వాత.. అది తిరగబెట్టకుండా, శరీరంలోని ఇతర అవయవాలకు క్యాన్సర్‌ కణాలు విస్తరించకుండా నిలువరించే టీకా. క్యాన్సర్‌ కణాలు మన రోగనిరోధక కణాలను (టి-సెల్స్‌) నిర్వీర్యం చేసే సంకేతాలను ఇవ్వకుండా కీట్రూడా ఔషధం నిరోధిస్తే.. టి-సెల్స్‌ ఏ కణాలపై దాడిచేయాలో ఈ ఎంఆర్‌ఎన్‌ఏ టీకా చెబుతుంది.

ఎవరి టీకా వారిదే..

ముందే చెప్పుకొన్నట్టు ఇది పర్సనలైజ్డ్‌ టీకా. అంటే.. అందరికీ ఒకే ఫార్ములాతో ఇచ్చే వ్యాక్సిన్‌ కాదు. బాధితుల శరీరంలోని క్యాన్సర్‌ కణితుల్లో మార్పుల ఆధారంగా వారి కోసమే ప్రత్యేకంగా తయారుచేసే టీకా అన్నమాట. అందులో భాగంగా.. మెలనోమాతో బాధపడుతున్నవారికి సర్జరీ చేసినప్పుడు సేకరించిన ట్యూమర్లలో జన్యువులను విశ్లేషించి..


వాటిలో ఉండే నియో యాంటిజెన్స్‌ను గుర్తిస్తారు. సాధారణ కణాలు క్యాన్సర్‌ కణాలుగా మారే క్రమంలో వాటి డీఎన్‌ఏలో కొన్ని ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్స్‌) జరుగుతాయి. ఈ మార్పుల వల్ల ఆ కణాల ఉపరితలంపై కొన్ని అసాధారణ ప్రొటీన్లు తయారవుతాయి. వాటినే నియో యాంటిజెన్స్‌ అంటారు. అవి ఆరోగ్యవంతమైన కణాలపై అస్సలు కనిపించవు. ఈ నియో యాంటిజెన్లను గుర్తించాక.. వాటిని ఆధారంగా చేసుకుని, ఒక మెసెంజర్‌ ‘ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ)’ను ల్యాబ్‌లో తయారుచేస్తారు. ఆ ఎంఆర్‌ఎన్‌ఏను ఇంజెక్షన్‌ ద్వారా రోగి శరీరంలోకి పంపిస్తారు. అప్పుడు రోగి శరీరంలోని సాధారణ కణాలు ఆ ఎంఆర్‌ఎన్‌ఏలోని సమాచారాన్ని చదివి.. సదరు నియో యాంటీజెన్లను ఉత్పత్తి చేసి, వాటి తాలూకూ ముక్కలను తమ ఉపరితలంపై ప్రదర్శిస్తాయి (సాధారణ కణాలు వాటిని ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేయకుండా కొద్దిపరిమాణంలో మాత్రమే ఉత్పత్తి చేసేలా టీకా డోసు ద్వారా నియంత్రిస్తారు). అప్పుడు రోగి శరీరంలోని రోగనిరోధక కణాలు (టీ సెల్స్‌) ఆ కొత్త కణాలను గుర్తించి, అప్రమత్తమై వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఆ కొత్త ప్రొటీన్‌ ముక్కలను గుర్తుపెట్టుకుని.. శరీరంలో ఎక్కడ కనిపించినా చంపేస్తాయి. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ టీకా అద్భుతమైన ఫలితాలను ఇవ్వడంతో మోడెర్నా షేర్లు ఒక్క సెషన్‌లోనే 177% పెరిగిపోయాయి. మెర్క్‌ కంపెనీ షేర్లు కూడా 12% మేర పెరిగాయి.

మట్‌ఏఐవర్స్‌

  • క్యాన్సర్‌ రావడానికి కారణాలను కనిపెట్టే ఏఐ ప్లాట్‌ఫామ్‌

ఎవరైనా క్యాన్సర్‌ బారిన పడితే.. అందుకు గల కారణాలను కనిపెట్టే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఢిల్లీలోని ‘ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దానిపేరు ‘మట్‌ఏఐవర్స్‌’. గువాహటిలో హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లతో బాధపడుతున్న 27 మందిపై దీన్ని పరీక్షించగా.. పొగాకు వాడకం వల్లే వారంతా క్యాన్సర్ల బారిన పడినట్టు అది విశ్లేషించింది.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:26 AM