Share News

‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా’గా కేరళ కుట్టి

ABN , Publish Date - Aug 25 , 2026 | 06:34 AM

మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2026 పోటీల్లో కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్‌ మెజో విజేతగా నిలిచారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో తనతో పోటీపడ్డ 52 మందిని వెనక్కి నెట్టి కిరీటం గెలుచుకున్నారు

‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా’గా కేరళ కుట్టి
MISS UNIVERSE KAZIAH

  • జైపూర్‌లో జరిగిన పోటీల్లో విజేతగా కజియా

  • నవంబరులో ప్యూర్టోరికోలో జరిగే మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం

జైపూర్‌, ఆగస్టు 24: మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2026 పోటీల్లో కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్‌ మెజో విజేతగా నిలిచారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో తనతో పోటీపడ్డ 52 మందిని వెనక్కి నెట్టి కిరీటం గెలుచుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీల్లో అందరికన్నా చిన్నవయస్కురాలైన కజియా తన అందంతోపాటు తెలివితేటలతోనూ న్యాయనిర్ణేతలను మెప్పించి టైటిల్‌ గెలుచుకున్నారు. మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2025 విజేత మానికా విశ్వకర్మ.. కజియాకు కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేశ్‌ తొలి రన్నర్‌పగా, గుజరాత్‌కు చెందిన అనుశీ సాత్వలేకర్‌ రెండో రన్నర్‌పగా నిలిచారు. ఇక వచ్చే నవంబరులో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారత్‌ తరఫున కజియా ప్రాతినిధ్యం వహించనున్నారు. కేరళలోని మావెలిక్కార ప్రాంతానికి చెందిన కజియా 2007లో జన్మించారు. ఈమె పెరిగింది మాత్రం యూఏఈలోని అబుధాబిలో. పాఠశాల విద్య కూడా అక్కడే చదివారు. ప్రస్తుతం కజియా ఓవైపు న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూనే.. మరోవైపు మోడల్‌గానూ పనిచేస్తున్నారు. 12 ఏళ్లపాటు శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నారు. మలయాళ చిత్రం షైలాక్‌తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అందాల పోటీలపై ఆసక్తితో 17ఏళ్ల వయసులో మిస్‌ టీన్‌ దివా-2024 పోటీల్లో పాల్గొని టైటిల్‌ గెలుచుకున్నారు.


అనంతరం మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌-2025 పోటీల్లో రన్నర్‌పగా నిలిచారు. మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీల ఫైనల్‌ రౌండ్‌లో తనకు ఎదురైన సంక్లిష్టమైన ప్రశ్నకు కజియా చక్కటి సమాధానమిచ్చి మార్కులు కొట్టేశారు. ‘మీ జీవితంలో నిశ్శబ్దానికి ఉన్న శబ్దాన్ని ఎలా వర్ణిస్తారు?’’ అని జడ్జిలు ప్రశ్నించగా, ‘‘నిశ్శబ్దమా! అది నాకు కొన్ని నిమిషాల క్రితమే ఎదురైంది. నేను వేదిక పైకి వచ్చేముందు ఇక్కడ అంతా మౌనమే ఆవహించి ఉంది. ఒక డ్యాన్సర్‌గా, నటిగా, అందాల పోటీల పట్ల ఆసక్తి ఉన్న యువతిగా నేను ఈ వేదిక పైనే ఎదిగాను. అందుకేనేమో ఈ వేదికపైకి వచ్చే ముందు ఒక రకమైన నిశ్శబ్దం, ప్రశాంతత నా సొంతమవుతాయి. ప్రస్తుతం నేను అలాంటి ప్రదేశంలోనే ఉన్నాను. నా భారత్‌లో నేనున్నాను’’ అని కజియా సమాధానం ఇచ్చారు.

Updated Date - Aug 25 , 2026 | 06:43 AM