రష్యా చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందా? మంత్రి జైశంకర్ రిప్లై ఇదీ
ABN , Publish Date - Feb 15 , 2026 | 10:07 AM
వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే భారత దేశ విధానమని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. చమురు కొనుగోళ్లకు సంబంధించి భారతీయ కంపెనీలు తమ ప్రయోజనాలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటాయని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురు (Russian Oil Purchase) కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందంటూ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Minister Jai Shankar) తాజాగా స్పందించారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే భారత దేశ విధానమని మంత్రి స్పష్టం చేశారు (Strategic Autonomy). జర్మనీలోని ప్రస్తుతం జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో (Munich Security Conference) మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్లపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందా? అని ప్రశ్నించారు. ఇది దేశ వ్యూహాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? అని అడిగారు.
ఈ ప్రశ్నలకు మంత్రి జైశంకర్ స్పందిస్తూ ఇంధన కొనుగోళ్ల అంశం సంక్లిష్టమైనదని అన్నారు. ఇతర దేశాల్లోని సంస్థల వలెనే భారతీయ ఇంధన కంపెనీలు కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. ధరలు, ఇంధన లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక భారత్ ఎల్లప్పుడూ పూర్తి స్వాతంత్ర్యంతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశ చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) శనివారం స్పందించారు. రష్యా కొనుగోళ్లను నిలిపివేస్తామంటూ భారత్ తమకు హామీ ఇచ్చిందని అన్నారు. ఈ దిశగా ఐరోపా దేశాలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయని అన్నారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ఈ వార్తలూ చదవండి:
కాంగ్రెస్ వల్లే ప్రమాదంలో దేశభద్రత: ప్రధాని మోదీ
అబద్ధాల గురువు మోదీ: రాహుల్ గాంధీ