మెటా, మైక్రోసాఫ్ట్‌ల్లో 20వేలకు పైగా ఉద్యోగాల కోత!
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:26 AM
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో రూ.వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ ఐటీ సంస్థలు సిబ్బంది వ్యయాలను మాత్రం తగ్గించుకుంటున్నాయి...
అదే బాటలో ఒరాకిల్, నైక్, స్నాప్, సేల్స్‌ఫోర్స్ సంస్థలు
మందగించిన ప్రవేశ స్థాయి, సాధారణ ఐటీ నియామకాలు
ఏఐ ఇంజనీర్లకు పెరుగుతున్న డిమాండ్: సీఎన్‌బీసీ నివేదిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో రూ.వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ ఐటీ సంస్థలు సిబ్బంది వ్యయాలను మాత్రం తగ్గించుకుంటున్నాయి. దీనిలో భాగంగా మైక్రోసాఫ్ట్, మెటా ఈ వారంలోనే 20వేలకు పైగా ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఏఐ సాంకేతికత కారణంగా టెక్నాలజీ పరిశ్రమలో చోటుచేసుకోబోయే విస్తృత సంస్కరణలకు ఇది నాంది కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్ సంస్థలు కలిసి ఈ ఏడాది ఏఐ మౌలిక సదుపాయాలపై సుమారు 700 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చు చేయనున్నాయి. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం... ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 92వేల మందికి పైగా సాంకేతిక నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో 2020 నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఉద్యోగ కోతల సంఖ్య 9లక్షలకు చేరింది. మెటా ఇటీవల తన ఉద్యోగులకు పంపిన లేఖలో... సిబ్బందిలో 10శాతం (దాదాపు 8వేల) మందిని తొలగించడంతో పాటు సంస్థలో ఖాళీగా ఉన్న 6 వేల పోస్టుల భర్తీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా సంస్థలోని అర్హులైన అమెరికా ఉద్యోగులకు తొలిసారిగా స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ తయారీ సంస్థ నైక్ తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో 1,400 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. స్నాప్ సంస్థ తన ఉద్యోగుల్లో 16 శాతం మందికి ఉద్వాసన పలకగా, సేల్స్‌ఫోర్స్ కంపెనీ 4వేల కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను రద్దుచేసింది. ఒరాకిల్ కూడా తన ఏఐ డేటా కేంద్రాల విస్తరణ కోసం వేలాది ఉద్యోగాల కోతను ప్రకటించిందని సీఎన్‌బీసీ పేర్కొంది. ఒకవైపు ఎంట్రీ లెవల్, సాధారణ ఐటీ ఉద్యోగాల నియామకాలు మందగిస్తుండగా, మరోవైపు ఏఐ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోందని వెల్లడించింది.
ఏఐ కోసం సేల్స్‌ఫోర్స్‌లో 1,000 మంది ఫ్రెషర్లు
కృత్రిమ మేధ (ఏఐ) కోసం 1,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటున్నట్టు సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్ పేర్కొన్నారు. ఈమేరకు కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్స్‌ను నియమించుకుంటున్నట్టు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఏఐ కోసం ఇంటర్స్స్, కొత్త గ్రాడ్యుయేట్లు కావాలని సేల్స్‌ఫోర్స్ కోరుకుంటోందని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సేల్స్‌ఫోర్స్‌లో ఏజెంట్‌ఫోర్స్, హెడ్‌లెస్ 360 వంటి ఏఐ ఆధారిత ప్రాజెక్టుల కోసం వీరి నియామకాలు చేపడుతున్నామన్నారు.