మాకు క్షమాపణ చెప్పాలి.. మెల్‌బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమ నిర్వాహకులు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:23 PM
మెల్‌బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంపై కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను కార్యక్రమ నిర్వాహకులు ఖండించారు. ఈ విషయమై తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మెల్‌బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంపై కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను కార్యక్రమ నిర్వాహకులు ఖండించారు. ఈ విషయమై తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కూడా లేఖ రాశారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మెల్‌బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి జనాల్ని డబ్బులు ఇచ్చి పిలిచారని సీనియర్ నేత పవన్ ఖేరాతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను కార్యక్రమ నిర్వాహకులు తమ లేఖలో ఖండించారు.
కాంగ్రెస్ నేతల ఆరోపణలు అసత్యాలని, అమర్యాదకరమని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారందరూ తమంతట తాముగా సొంత ఖర్చులతో అక్కడికి వచ్చారని అన్నారు. బీజేపీగానీ, భారత ప్రభుత్వం గానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం గానీ ఈ ఖర్చులకు డబ్బులు చెల్లించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లు, ఇతరుల వ్యాఖ్యలు ఆస్ట్రేలియాలో ఎన్నారైల వ్యక్తిత్వంపై వేలెత్తి చూపేలా ఉన్నాయని అన్నారు. వారందరినీ డబ్బులిచ్చి రప్పించారని అనడం భారతీయ ఆస్ట్రేలియన్లను అవమానించడమేనని స్పష్టం చేశారు. దేశీయ రాజకీయాలకు ఎన్నారైలు మూల్యం చెల్లించేలా చేయకూడదని వ్యాఖ్యానించారు. మోల్‌బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్‌తో డీల్‌ను భారత్ కాదన్నదంటూ వార్తలు.. ఖండించిన కేంద్ర మంత్రి
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. జరిమానా డబ్బుతో పంచాయతీ పెద్దల పార్టీ..