Share News

మూడేళ్ల బాలికపై అత్యాచారం.. జరిమానా డబ్బుతో పంచాయతీ పెద్దల పార్టీ..

ABN , Publish Date - Jul 13 , 2026 | 07:41 PM

మూడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనను కప్పిపుచ్చేందుకు గ్రామ పంచాయతీ పెద్దలు ప్రయత్నించిన తీరు విమర్శలకు దారి తీసింది. పైగా నిందితుడికి విధించిన జరిమానా డబ్బుతోనే వారంతా మాంసం, మద్యంతో విందు చేసుకోవడం కలకలం రేపింది.

మూడేళ్ల బాలికపై అత్యాచారం.. జరిమానా డబ్బుతో పంచాయతీ పెద్దల పార్టీ..
Three Year Old Girl Assault

రాంచీ: మూడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనను కప్పిపుచ్చేందుకు గ్రామ పంచాయతీ పెద్దలు ప్రయత్నించిన తీరు విమర్శలకు దారి తీసింది. పైగా నిందితుడికి విధించిన జరిమానా డబ్బుతోనే వారంతా మాంసం, మద్యంతో విందు చేసుకోవడం కలకలం రేపింది. గ్రామస్థుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘాఘ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సునీల్ లోహ్రా గత శనివారం సాయంత్రం బాధిత చిన్నారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్నారిని తాను చూసుకుంటానంటూ నమ్మబలికాడు. అనంతరం ఇంటి లోపలికి తీసుకెళ్లి ఓ గదిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతసేపటికి చిన్నారి గట్టిగా ఏడుస్తూ, తీవ్ర ఇబ్బందితో బయటకు రావడాన్ని తల్లి గమనించింది. వెంటనే చిన్నారిని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబం బయలుదేరగా.. గ్రామ పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. విషయం బయటకు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కరించాలని పట్టుపట్టారు. ఆదివారం నాడు పంచాయితీ పెట్టి సునీల్ లోహ్రాకు రూ.లక్ష జరిమానా విధించారు. నిందితుడు తొలుత రూ.20 వేలు చెల్లించగా.. మిగిలిన రూ.80 వేలు వారంలోగా చెల్లించాలని ఆదేశించారు. అయితే, ఆ రూ.20 వేలను బాధిత కుటుంబానికి ఇవ్వకుండా పంచాయతీ పెద్దలు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మాంసం, మద్యంతో విందు ఏర్పాటు చేసుకుని సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.


అదే సమయంలో విషయం ఘాఘ్రా పోలీసుల దృష్టికి వెళ్లింది. స్టేషన్ ఇన్‌ఛార్జ్ మోహన్ కుమార్ తన సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే జరిమానా డబ్బులతో ఏర్పాటు చేసిన విందు కొనసాగుతోంది. బాధితురాలి తల్లిని కలువగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సునీల్ లోహ్రా అరెస్టు చేశారు. పంచాయతీ పెద్దలపైనా చర్యలకు ఉపక్రమించారు.


అయితే, చిన్నారిపై అత్యాచారాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించిన గ్రామ పెద్దలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకోవడంపై మండిపడుతున్నారు. మరోవైపు, చిన్నారికి చెందాల్సిన నగదుతో పార్టీ చేసుకోవడంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కామాంధుడి అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టిన యువతి.. వైరల్ వీడియో..

పోర్నోగ్రఫీ నియంత్రణపై ఆ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Jul 13 , 2026 | 07:46 PM