Share News

యూఎస్‌తో డీల్‌ను భారత్ కాదన్నదంటూ వార్తలు.. ఖండించిన కేంద్ర మంత్రి

ABN , Publish Date - Jul 13 , 2026 | 08:03 PM

యూఎస్‌తో మధ్యంతర డీల్‌ను భారత్ తిరస్కరించిందంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఖండించారు.

యూఎస్‌తో డీల్‌ను భారత్ కాదన్నదంటూ వార్తలు.. ఖండించిన కేంద్ర మంత్రి
Piyush Goyal

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌తో మధ్యంతర డీల్‌ను భారత్ తిరస్కరించిందంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఖండించారు. అవన్నీ పూర్తి నిరాధార, అసత్య వార్తలని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, యూఎస్ మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని కామర్స్ శాఖ సెక్రటరీ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌తో భారత్ తనకు మరింత అనుకూలమైన డీల్‌ కోసం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మధ్యంతర డీల్‌కు భారత్ నో చెప్పిందనేది ఈ వార్తల సారాంశం.


ఈ వార్తలపై ఎక్స్ వేదికగా మంత్రి గోయల్ స్పందించారు. జూన్ నెలలో యూఎస్ వాణిజ్య ప్రతినిధితో సమావేశం జరిగిందని, అద్భుత పురోగతి కనిపించిందని చెప్పారు. పరస్పర ప్రయోజనం కలిగించే డీల్‌కు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఈ దిశగా ఇరు దేశాల బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు మినహా వాణిజ్య ఒప్పందానికి ఎలాంటి అడ్డంకులు లేవని అన్నారు. అంతకుముందు మంత్రి ఇదే అంశంపై మాట్లాడుతూ చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని చెప్పారు. చర్చల్లో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని అన్నారు. ఇరు దేశాలు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

మూడేళ్ల బాలికపై అత్యాచారం.. జరిమానా డబ్బుతో పంచాయతీ పెద్దల పార్టీ..

పోర్నోగ్రఫీ నియంత్రణపై ఆ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Jul 13 , 2026 | 09:33 PM