ఏకపక్షంగా తిరస్కరించారు
ABN , Publish Date - Jun 12 , 2026 | 06:18 AM
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్‌ను తిరస్కరించటంపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదైన కేసు గురించి...
ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
న్యాయం చేయండి..
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ రిట్ పిటిషన్ దాఖలు.. నేడు విచారణ
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
విజేతలుగా ప్రకటించిన ఈసీ
న్యూఢిల్లీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్‌ను తిరస్కరించటంపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదైన కేసు గురించి వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. నామినేషన్ తిరస్కరణ అన్యాయమని, ఇది ముమ్మాటికీ ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మీనాక్షి పిటిషన్‌పై అత్యవసరవిచారణ జరపాలని గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌ల ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మౌఖికంగా అభ్యర్థించారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారమే చివరి రోజు కావడంతో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఫలితాల ప్రకటనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సింఘ్వీ విన్నవించారు. ఒక క్రిమినల్ కేసు వివరాలను దాచారనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే, సదరు క్రిమినల్ కేసును కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎ్‌సఎస్) సెక్షన్ 223 ప్రకారం పరిగణనలోకి తీసుకోకముందు ఇచ్చే నోటీసు (ప్రీ కాగ్నీజెంట్ సమన్స్) మాత్రమే ఆమెకు అందిందని వాదించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏ ప్రకారం, కోర్టులు పరిగణనలోకి తీసుకున్న క్రిమినల్ కేసులను (కనిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడేవి) మాత్రమే అభ్యర్థులు వెల్లడించాల్సి ఉంటుందని ఆయ న ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. ‘ఎన్నికల విషయాలలో కోర్టులు మధ్యంతరంగా జోక్యం చేసుకోవు కదా? ఈ పిటిషన్ ఎలా నిలబడుతుంది?’ అని ప్రశ్నించారు. అయితే, స్పష్టమైన లోపాలు లేదా పొరపాట్లు జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సింఘ్వీ వాదించారు. ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, దామా శేషాద్రినాయుడు ఈ పిటిషన్ అర్హతను ప్రశ్నించారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..