‘ప్రధాని వీడియో బ్లాక్’పై జుకర్‌బర్గ్ క్షమాపణలు
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:25 AM
ప్రధాని మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఓ వీడియోను తాత్కాలికంగా నిలిపివేసిన ఘటనపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సంస్థల యజమాని, మెటా ఫ్లాట్‌ఫామ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్...
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మెటా బృందం భేటీ.. మోదీ వీడియో నిలిపివేతపై తీవ్ర పశ్చాత్తాపం
నిర్వహణలో లోపాలున్నట్లు అంగీకారం.. డబ్బు తీసుకొని కంటెంట్ ప్రమోషన్స్ జరుగుతున్నాయ్
కొందరి కోసం చట్టవిరుద్ధ కంటెంట్.. డీప్‌ఫేక్ కట్టడిలో విఫలమయ్యామన్న మెటా ప్రతినిధులు
సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి
మెటా ప్రతినిధులతో మళ్లీ భేటీ కానున్న కేంద్ర బృందం
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రధాని మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఓ వీడియోను తాత్కాలికంగా నిలిపివేసిన ఘటనపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సంస్థల యజమాని, మెటా ఫ్లాట్‌ఫామ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను, డీప్‌ఫేక్‌ను కట్టడి చేయడంలో తమ ఫ్లాట్‌ఫామ్ విఫలమైందని.. నిర్దిష్టమైన కంటెంట్ ప్రమోషన్స్ కోసం భారీగా చెల్లింపులు జరుగుతున్నట్లు మెటా సంస్థ ప్రతినిధులు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ సంస్థ పేర్కొంది. తమ ప్లాట్‌ఫామ్స్ నిర్వహణలో లోపాలు ఉన్నట్లు మెటా అంగీకరించినట్లుగా కేంద్రం వెల్లడించిందని పీటీఐ పేర్కొంది. మోదీ వీడియోను ఇన్‌స్టా వేదికగా తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటన నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో మెటా గ్లోబల్ ఎఫైర్స్ చీఫ్ జోయల్ కప్లాన్ నేతృత్వంలోని బృందం తొలుత ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్, ఆ తర్వాత కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమైంది. ఈ రెండు భేటీల గురించి మెటా ప్రతినిధులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే సమావేశం సందర్భంగా.. మోదీ వీడియో తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై, కంటెంట్ నిర్వహణ వైఫల్యంపై ప్రశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. సమావేశం సందర్భంగా కేంద్ర ప్రతినిధులు కీలక అంశాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది. వినియోగదారులకు ఏ కంటెంట్ వెళ్లాలనే దాన్ని మెటా అల్గరిథంలు నిర్ణయిస్తునందున భారత ఐటీ చట్టం కింద మెటాకు లభించే న్యూట్రల్ ఇంటర్మీడియటరీ (తటస్థ మద్యవర్థి) హోదాను ఆ సంస్థ క్లెయిమ్ చేయలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనివల్ల సేఫ్‌హార్బర్ రక్షణను కోల్పోవాల్సి వస్తుందని. హెచ్చరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా.. పిల్లలపై లైంగిక వేధింపు కంటెంట్, డీప్‌ఫేక్ కట్టడిపై మెటాను ప్రశ్నించినట్లు తెలిసింది.
అయితే ఎంచుకున్న కొందరు వీక్షకుల కోసం భారీ ఎత్తున చట్ట విరుద్ధమైన కంటెంట్ ప్రమోట్ అవుతున్నట్లు, డబ్బులు తీసుకొని పెయిడ్ ప్రమోషన్స్ జరుగుతున్నట్లు ఈ సందర్భంగా మెటా అంగీకరించినట్లుగా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. కాగా ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేయకుండా ఉండేందుకు, వారి పేరుతో నకిలీ ఖాతాలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, చట్టాలకు లోబడి పనిచేయాలని మెటాను కేంద్ర ప్రతినిధులు నిర్దేశించినట్లు సమాచారం. ఈ విషయంలో మెటా బృందంతో మరోసారి సమావేశం ఉంటుందని కేంద్రం వెల్లడించినట్లుగా తెలిపింది. కాగా మోదీ వీడియో తాత్కాలిక నిలిపివేతపై జుకర్‌బర్గ్ మూడురోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ కమిటీ ఆగస్టు 3న అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. లేదంటే మెటా ఫ్లాట్‌ఫామ్‌లకు లభించే సేఫ్‌హార్బర్ వ్యవస్థను నిలిపివేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని, అప్పుడు ఆ వేదికపై పోస్ట్ అయ్యే చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు ఆ సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిటీ అప్పట్లో హెచ్చరించింది. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను బ్లాక్ చేయడం అంటే అది నేరుగా భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించింది. కాగా వీడియో బ్లాక్ ఘటన అనేది సాంకేతిక తప్పిదమేనంటూ మెటా ప్రతినిధులు అంతకుముందే వివరణ ఇవ్వగా.. అది సహేతుకంగా లేదని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు