South Korean Boyfriend: కొరియన్ బాయ్‌ఫ్రెండ్‌ను చంపేసిన భారతీయ యువతి.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:37 AM
ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. గొడవ సమయంలో మణిపూర్‌కు చెందిన యువతి తన సౌత్ కొరియన్ బాయ్‌ఫ్రెండ్ డక్ హీ యూను కత్తితో పొడిచి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఓ భారతీయ యువతి తన కొరియన్ బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేసింది. గొడవ సందర్భంగా ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియాకు చెందిన డక్ హీ యూ అనే వ్యక్తి గత కొన్నేళ్ల నుంచి గ్రేటర్ నోయిడాలోని ఓ మొబైల్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ ఉన్నాడు. మణిపూర్‌కు చెందిన లుంజియానా పామాయ్ అనే యువతి కూడా గ్రేటర్ నోయిడాలో ఉద్యోగం కోసం వచ్చి స్థిరపడింది. కొన్ని నెలల క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఇద్దరూ కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం మొదలెట్టారు. డక్ హీ యూ తాగుడుకు బానిసయ్యాడు. ఇంటికి తాగి వచ్చిన ప్రతీసారి లుంజియానాతో గొడవ పెట్టుకునేవాడు. ఆమెను బాగా కొట్టేవాడు. నిన్న (ఆదివారం) కూడా బాగా తాగి ఇంటికి వచ్చాడు. ప్రియురాలితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ప్రియుడి వేధింపులను లుంజియానా తట్టుకోలేకపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతడి ఛాతిపై కత్తితో పొడిచేసింది. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. భయపడిపోయిన లుంజియానా అతడ్ని వెంటనే జిమ్స్ ఆస్పత్రికి తరలించింది.
డక్ హీ యూను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. డక్ హీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లుంజియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి వేధింపులు భరించలేక క్షణికావేశంలో కత్తితో పొడిచినట్లు లుంజియానా పోలీసులకు తెలిపింది. అతడ్ని చంపాలన్న ఉద్దేశం తనకు లేదని కూడా స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
హసీనాను కూడా పంపేయండి.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు అసదుద్దీన్ ఓవైసీ మద్దతు
ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?