ఒంటిపై నగల కోసం మహిళ హత్య.. 10 గంటల్లోనే హంతకుడిని పట్టుకున్న పోలీసులు..
ABN , Publish Date - Mar 26 , 2026 | 06:22 PM
ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. నగలను దోచుకెళ్లిపోయాడు. చెవులకు ఉన్న కమ్మల కోసం ఏకంగా చెవులనే కత్తిరించేశాడు. డెడ్ బాడీ దొరికిన 10 గంటల్లోనే పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మహిళ ఒంటిపై నగల కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. నగలను దోచుకెళ్లిపోయాడు. చెవులకు ఉన్న కమ్మల కోసం ఏకంగా చెవులనే కత్తిరించేశాడు. డెడ్ బాడీ దొరికిన 10 గంటల్లోనే పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మెహ్‌శానా జిల్లాలోని ఇంద్రద్ గ్రామానికి చెందిన 60 ఏళ్ల శారదాబెన్ ఠాకూర్ మార్చి 20వ తేదీన పశువులకు గడ్డి తేవటానికి పొలానికి వెళ్లింది. ఆమె ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు ఊరంతా గాలించారు.
ఆమె ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా శారద కనిపించకుండా పోవటానికి ముందు ‘సవిత ఫామ్’ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఫామ్‌లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిమ్మ చెట్టు దగ్గర భూమి తవ్విన గుర్తులు ఉండటం గుర్తించారు. అక్కడ తవ్వి చూడగా శారద శవం బయటపడింది. ఆమె చెవులు కత్తిరించి ఉన్నాయి. ఆమె ఒంటిపై ఉన్న 4 లక్షల రూపాయలు విలువ చేసే నగలు కనిపించలేదు. నగల కోసం ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
నిందితుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఇలాంటి సమయంలో సచిన్ కుమార్ ముకుంద్‌భాయ్ దంతానీ అనే వ్యక్తి కేజీ బరువున్న వెండి గజ్జెలను అమ్మే ప్రయత్నం చేస్తూ పోలీసులకు దొరికాడు. అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. అప్పుల బాధ తట్టుకోలేక నగల కోసం శారదను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. శారద డెడ్ బాడీ దొరికిన 10 గంటల్లోనే నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని, దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు. సచిన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 27వ తేదీ వరకు పోలీస్ రిమాండ్ విధించింది.
ఇవి కూడా చదవండి
అమరావతికి చట్టబద్ధత.. క్యాబినెట్ కీలక తీర్మానం
ఐపీఎల్2026: ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే..!