Share News

అంత్యక్రియల సందర్భంగా విషాదం.. వ్యక్తిని నదిలోకి లాక్కుపోయిన మొసలి

ABN , Publish Date - May 21 , 2026 | 09:35 PM

అత్త అంత్యక్రియల కోసం వెళ్లిన వ్యక్తి మొసలి నోట చిక్కాడు. అంత్యక్రియల సందర్భంగా నది దగ్గర నిల్చుని ఉండగా మొసలి ఆ వ్యక్తిపై దాడి చేసి లోపలికి లాక్కుపోయింది.

అంత్యక్రియల సందర్భంగా విషాదం.. వ్యక్తిని నదిలోకి లాక్కుపోయిన మొసలి
Gonda crocodile attack

ఇంటర్‌నెట్ డెస్క్: అత్త అంత్యక్రియల కోసం వెళ్లిన వ్యక్తి మొసలి నోట చిక్కాడు. అంత్యక్రియల సందర్భంగా నది దగ్గర నిల్చుని ఉండగా మొసలి ఆ వ్యక్తిపై దాడి చేసి లోపలికి లాక్కుపోయింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గోండ జిల్లాలోని ఉర్మి గ్రామానికి చెందిన ఉర్మిళా దేవి క్యాన్సర్ కారణంగా మంగళవారం చనిపోయింది. సమాచారం అందుకున్న అల్లుడు దీపక్ శర్మ తన భార్యతో మంగళవారం రాత్రి గ్రామానికి వచ్చాడు. బుధవారం ఉర్మిళా దేవి అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులు సరయు నది ఒడ్డున ఏర్పాట్లు చేశారు.


దీపక్ దగ్గరుండి అత్త అంత్యక్రియల కోసం చితి పేర్చాడు. ఖననం చేయడానికి సమయం ఉండటంతో నది ఒడ్డున నిల్చుని ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ మొసలి నీటిలోంచి బయటకు వచ్చింది. నది ఒడ్డున నిల్చుని ఉన్న దీపక్‌పై దాడి చేసింది. అతడిని నీటిలోకి లాక్కుపోయింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. జనం స్పందించడానికి కొంచెం కూడా సమయం లేకపోయింది. స్థానికులు దీపక్ కోసం బోటు సాయంతో వెతకటం మొదలెట్టారు. దీపక్ ఆచూకీ లభించలేదు.


సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ సిబ్బంది దీపక్ కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలెట్టారు. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. ‘అంత్యక్రియల సందర్భంగా దీపక్‌ను గ్రామస్థులు హెచ్చరించారు. నదిలో మొసళ్లు ఉన్నాయి.. ఒడ్డుకు వెళ్లవద్దని పదే పదే చెప్పారు. దీపక్ వారి మాటలను లెక్కచేయలేదు. నది ఒడ్డుకు వెళ్లాడు. మొసలి అతడిని లోపలికి లాక్కుపోయింది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

గుజరాత్ బ్యాటర్ల హవా.. చెన్నై ముందు భారీ లక్ష్యం..

కాళేశ్వరంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం..

Updated Date - May 21 , 2026 | 09:45 PM